Home రాజకీయాలు వైఎస్సార్సీపీలో బుజ్జగింపుల పర్వం పూర్తైనట్టే!

వైఎస్సార్సీపీలో బుజ్జగింపుల పర్వం పూర్తైనట్టే!

SHARE

కేబినెట్లో చోటు దక్కని విషయంలో అలక వహించిన నేతలను బుజ్జగించే పర్వాన్ని పూర్తి చేసినట్టుగా ఉన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానవర్గం నేతలు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇరవై ఐదు మందిలో జంబో కేబినెట్ ను ఏర్పాటు చేసినా కొంతమంది నేతలకు మంత్రి పదవులు దక్కలేదు. దీంతో వారు అసంతృప్తికి గురి అయ్యారు. జగన్ కేబినెట్లో చోటు గ్యారెంటీ అనే విషయంలో కొంతమంది నేతల పేర్లు గట్టిగా వినిపించాయి.

అలాంటి వారికే సీఎం జగన్ మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వకపోవడంతో ఈ అంశం చర్చనీయాంశంగా నిలిచింది. దీనికి తోడు సదరు నేతలు కామ్ అయిపోయారు. తమకు మంత్రి పదవి దక్కలేదని వారిలో ఎవరూ రచ్చకు ఎక్కలేదు. ఎవరికి వారు సైలెంట్ అయితే అయ్యారు.

ఈ నేపథ్యంలో అలాంటి వారిని అలా వదిలేయకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వారిని కూల్ చేసే పనిని చేపట్టినట్టుగా తెలుస్తోంది.అందుకోసం వారిని పిలిపించి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడినట్టుగా సమాచారం. అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి పలువురు అసంతృప్త ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడారు.

వారిలో ఆర్కే రోజా తదితరులు ఉన్నారు. మంత్రి పదవి దక్కలేదని వారు అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి వారిని పిలిపించుకుని మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడే పదవి దక్కలేదని అసంతృప్తికి లోను కావొద్దని. ముందు ముందు మంచి అవకాశాలు ఉంటాయని సదరు నేతలకు జగన్ మోహన్ రెడి భరోసా ఇచ్చినట్టుగా సమాచారం.

ఎలాగూ రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్లో మార్పు లు తప్పవని జగన్ ఇది వరకే ప్రకటించారు. దాదాపు తొంభై శాతం మందిని మార్చే అవకాశాలుంటాయని జగన్ పార్టీ నేతలకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసంతృప్త నేతలకు కూడా ఆ విషయాన్నే చెప్పి జగన్ మోహన్ రెడ్డి ఊరడించినట్టుగా తెలుస్తోంది.