Home రాజకీయాలు టీడీపీ టు బీజేపీ వయా కర్ణాటక

టీడీపీ టు బీజేపీ వయా కర్ణాటక

SHARE

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ చావుదెబ్బ తింది. దీంతో ఆ పార్టీలోని ప్రముఖ నాయకులు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా అధికార పక్షంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా చేయలేని పరిస్థితి. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరేందుకు అనంతపురానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగా కర్ణాటకలోని బీజేపీ నాయకులతో తొలుత చర్చించి అనంతరం ఢిల్లీ పెద్దలతో మాట్లాడినట్లు సమాచారం. కాగా జేసీ సోదరులను వద్దని.. పరిటాల కుటుంబం, పల్లె రఘునాథరెడ్డి, వరదాపురం సూరికి మాత్రం బీజేపీ నాయకులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజా ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో టీడీపీ కోలుకోలేని విధంగా దెబ్బతింది. 14 అసెంబ్లీ స్థానాలకుగానూ 12 చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. హిందూపురం, ఉరవకొండలో మాత్రమే నందమూరి బాలకృష్ణ, పయ్యావుల కేశవ్‌ గెలిచారు. బంపర్‌ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ సీపీ సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం ఖాయమనే అంచనాకు వచ్చిన టీడీపీ నేతలు ప్రత్యామ్నాయం దిశగా అడుగులువేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా టీడీపీని వీడి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

రాజ్యసభ ఎంపీ సీటు కావాలన్నందుకే..
పక్క రాష్ట్రం కర్ణాటకలో బీజేపీ హవా కొనసాగుతోంది. ఈక్రమంలో అక్కడి నాయకులతో జేసీ దివాకర్‌రెడ్డి చర్చలు జరిపారు. తనకు రాజ్యసభ ఎంపీ ఖరారు చేస్తే బీజేపీలోకి చేరడంతో పాటు రూ.150 కోట్ల మేర పార్టీకి నిధులు సమకూరుస్తానని చెప్పినట్లు సమాచారం. అయితే కర్నాటక నేతలు ఢిల్లీ పెద్దలకు సమాచారం పంపించినా.. అక్కడ రాంమాధవ్, మురళీధర్‌రావు అడ్డుకట్ట వేశారు. దీంతో బీజేపీ చీఫ్‌ అమిత్‌షా కూడా జేసీ సోదరులను వద్దని చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో తన ప్రయత్నాలు విఫలం కావడంతో జేసీ దివాకర్‌రెడ్డి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. టీడీపీని వీడి బీజేపీలో చేరనున్న నేతల్లో జేసీ సోదరులు మొదటి వరుసలో ఉన్నారు. ఎన్నికల్లో జేసీ సోదరులు రాజకీయాల నుంచి తప్పుకుని వారసులను బరిలోకి దింపినా వారికీ పరాభవమే ఎదురైంది. ఫలితంగా తమ కుమారులతో చర్చించిన జేసీ బ్రదర్స్‌ టీడీపీకి ఇక భవిష్యత్తు లేదనే నిర్ణయానికి వచ్చారు. దీంతో తమ వారసులను బీజేపీలోకి పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ దిశగా ప్రయత్నాలు ఫలించినట్లు కనిపించలేదు.

మిగతా వారికి గ్రీన్‌ సిగ్నల్‌
అనంతపురం జిల్లాకు చెందిన జేసీ సోదరులను వద్దని చెప్పిన కమలనాథులు పరిటాల కుటుంబం, పల్లె రఘునాథరెడ్డి, వరదాపురం సూరి తదితరులను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈమేరకు త్వరలోనే ఢిల్లీ వేదికగా అమిత్‌షా ఆధ్వర్యంలో వీరు బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. బీజేపీ అధిష్టానం కూడా ఇప్పటికే వీరితో సంప్రదింపులు పూర్తి చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరితో రాంమాధవ్‌ చర్చలు జరిపినట్లు సమాచారం. ఈసారి ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్‌ పోటీ చేసి ఓటమి చవిచూశారు. బీజేపీలో చేరేందుకు వీరు కూడా సంప్రదింపులు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్నందున హఠాత్తుగా పార్టీ మారితే నియోజకవర్గంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనే దానిపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఫలితంగా అనుచరులతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం. కుదిరితే ఈ నెల 23 లేదా 27న వీరు బీజేపీలో చేరతారని తెలుస్తోంది.