Home రాజకీయాలు ‘చంద్రబాబూ.. సొంతిల్లు కట్టుకోవా?’

‘చంద్రబాబూ.. సొంతిల్లు కట్టుకోవా?’

SHARE

అమరావతి ప్రాంతంలో తను ఇన్నాళ్లూ అద్దెకు నడిపిన తన అధికారిక నివాసంలో భాగమైన భవనానికి ఆనుకుని ఉన్న ‘ప్రజావేదిక’ను తన అధికారిక నివాసంగా గుర్తించాలన్న చంద్రబాబు లేఖపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ ఉంది. అక్కడ తనను కలవడానికి వచ్చిన వారితో సమావేశం అవుతుండటం జరుగుతుందంటూ చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో జగన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తిదాయకంగా మారింది.

ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి స్పందించారు. ట్విటర్ ద్వారా సాయి రెడ్డి రియాక్ట్ అయ్యారు. ” సిఎం జగన్ గారికి చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యల పైన ఉంటుందనుకున్నాం. 40 ఏళ్ల అనుభవానికి తను ఉండే విలాసవంతమైన నివాసం ఉంటుందా, పోతుందా అనే సంశయం తప్ప ఇంకేమీ కనిపించడం లేనట్టుంది. ప్రపంచం మొత్తాన్నిఅమరావతికి రప్పిస్తా అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా?” అంటూ విజయసాయి రెడ్డి స్పందించారు.

చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల మీద లేఖ రాయాల్సింది పోయి, ఇలా తన నివాసం గురించి ముఖ్యమంత్రికి లేఖ రాయడాన్ని విజయసాయి రెడ్డి తప్పు పట్టారు. అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు ఇది వరకూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ తీవ్రంగా ఎద్దేవా చేశారు.

అది అక్రమ కట్టడం అని, ఆక్రమిత కట్టడం అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఆరోపిస్తూ వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఇలా రియాక్ట్ కావడంలో పెద్దగా ఆశ్చర్యం లేదేమో!