Home రాజకీయాలు వాళ్ల కష్టానికి జగన్ ‘థ్యాంక్స్’ చెప్పారు!

వాళ్ల కష్టానికి జగన్ ‘థ్యాంక్స్’ చెప్పారు!

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గత ఐదేళ్లలో మీడియా అండ పెద్దగా లేకపోయినా.. ఆ పార్టీకి సోషల్ మీడియానే బాగా అండగా నిలిచింది. ఎన్నికలకు చాలా ముందు నుంచినే సోషల్ మీడియాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు బాగా యాక్టివ్ గా ఉంటూ వచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం అయితేనేం, తమ పార్టీ అజెండాను నెటిజన్ల మధ్యకు తీసుకెళ్లడంలో అయితేనేం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు విజయవంతం అయ్యారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైన్యాన్ని చూసి తెలుగుదేశం వాళ్లే ఒక దశలో భయపడ్డారు. దొరికిన వారిని దొరికినట్టుగా అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం కూడా జరిగింది. అయినా సోషల్ మీడియాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊపు ఎక్కడా తగ్గలేదు. తెలుగుదేశం వారు తప్పులు చేసి దొరికినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వారిని ఉతికి ఆరేశారు!

తెలుగుదేశం పార్టీకి మీడియా అండ ఉన్నా.. సోషల్ మీడియాను ఎదుర్కొనడం మాత్రం ఆ పార్టీకి అంత ఈజీ కాలేదు. ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత చాలా మంది చేసిన విశ్లేషణల్లో కూడా సోషల్ మీడియా ప్రస్తావన వచ్చింది.

ఇప్పుడు ఆ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా స్పందించారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సీఎం ట్వీట్ చేశారు. ఫేస్ బుక్ పోస్టు పెట్టారు.

”నేను రాష్ట్ర బాధ్యతలను స్వీకరించటానికి సహకరించిన సోషల్ మీడియా యోధులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వైఎస్సార్సీపీ గెలుపు కోసం మీరు ఎంతలా కష్టపడ్డారో నాకు తెలుసు. ఎల్లో మీడియా తప్పుడు వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వైఎస్సార్సీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. మీ సహకారాన్ని ఎప్పుడూ ఇలానే కొనసాగిస్తారని ఆశిస్తున్నా” అంటూ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ ధన్యవాదాలతో ఆయన అభిమానులు ఖుష్ అవుతున్నారు.