Home రాజకీయాలు టీడీపీ ముగ్గురు ఎంపీల్లో.. ఒకరు చేజారినట్టేనా!

టీడీపీ ముగ్గురు ఎంపీల్లో.. ఒకరు చేజారినట్టేనా!

SHARE

లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ముక్కిమూలిగి నెగ్గింది కేవలం ముగ్గురు మాత్రమే! అన్ని ఎంపీ సీట్లలోనూ తెలుగుదేశం పార్టీ వాళ్లను గెలిపించాలని చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తే.. ఆయన ఐదేళ్ల పాలన తీరును గమనించిన తర్వాత ఏపీ ప్రజలకు కేవలం మూడు సీట్లలో మాత్రమే తెలుగుదేశం పార్టీ వాళ్లను గెలిపించారు. అలా మూడు సీట్లకు పరిమితం అయ్యింది టీడీపీ.

ఈ క్రమంలో ఆ ముగ్గురు అయినా తెలుగుదేశం పార్టీలో ఉంటారా? అనేది సందేహంగానే నిలుస్తూ వస్తోంది. ఎందుకంటే అధికారంలో లేని పార్టీలో ఉండటం వేస్ట్.. అనే పరిస్థితిని కల్పించారు చంద్రబాబు నాయుడు. ఈ విషయాన్ని ఆయన పార్టీలోని వారు కూడా ఫాలో అయితే ఇప్పుడు ఆ పార్టీలో మిగిలే వారు ఎవరూ ఉండరు. ఈ క్రమంలో ఎంపీల్లో అది మొదలైనట్టుగా తెలుస్తోంది.

ముందుగా విజయవాడ ఎంపీ కేశినేని నాని ఈ రేసులో ఉన్నారని తెలుస్తోంది. ఆయన తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేయడం ఖాయమని ఆయన బీజేపీలో చేరే ప్రయత్నంలో ఉన్నారని ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పటికే వెళ్లి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అయ్యారు కేశినేని. అప్పుడే ఆయన బీజేపీలోకి చేరడం ఖాయమనే అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు దక్కిన లోక్ సభ విప్ పదవి కూడా వద్దు అనేశారు. ఆ బాధ్యతలు తన స్థాయికి చాలా పెద్దవని, కాబట్టి చంద్రబాబు నాయుడు వేరే ఎవరినైనా ఆ పదవికి ఎంపిక చేసుకోవాలని కేశినేని నాని ట్వీట్ చేశారు. తద్వారా తెలుగుదేశం పార్టీకి దూరం కాబోతున్న సంకేతాలు చాలా స్పష్టంగా ఇచ్చేశారు.

ఇప్పటికే నితిన్ గడ్కరీతో సమావేశం కావడం, ఇప్పుడు ఈ ట్వీట్.. ఈ రెండింటినీ కలిపి చూస్తే కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడటం ఖాయమనే అభిప్రాయాలు కలుగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.