Home రాజకీయాలు దివాకర్ రెడ్డి టోన్ మారింది.. రాజకీయాలకు గుడ్ బై అట!

దివాకర్ రెడ్డి టోన్ మారింది.. రాజకీయాలకు గుడ్ బై అట!

SHARE

తను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టుగా ప్రకటించారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఇక మరే పార్టీలోకి చేరే ఉద్దేశం లేదని, తను ప్రత్యక్ష రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్టుగా దివాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ ఎన్నికల్లో దివాకర్ రెడ్డి పోటీ చేయని సంగతి తెలిసిందే. అనంతపురం నుంచి జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేశారు.

తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి పవన్ రెడ్డి చిత్తుగా ఓడారు. అంతే గాక తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడి కొడుకు అస్మిత్ రెడ్డి కూడా ఓడిపోయారు. అలా సొంత కోటలాంటి తాడిపత్రిలోనూ, అనంతపురంలోనూ ఓడి జేసీ కుటుంబం రాజకీయంగా దెబ్బతింది.

ఈ నేపథ్యంలో రాజకీయ సన్యాసాన్ని ప్రకటించారు దివాకర్ రెడ్డి. ఇక ఇదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి మీద కూడా జేసీ దివాకర్ రెడ్డి టోన్ మార్చారు. ఇది వరకూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డి ఎలా మాట్లాడే వారో అందరికీ తెలిసిందే. పదే పదే జగన్ విషయంలో అనుచితంగా మాట్లాడారు దివాకర్ రెడ్డి. జగన్ ను ఏక వచనంలో సంబోధించడంతో మొదలు.. అడ్డగోలుగా మాట్లాడారు.

కేవలం జేసీ దివాకర్ రెడ్డి మాత్రమే కాకుండా ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా జగన్ మీద అనుచితంగా మాట్లాడిన వారిలో ముందున్నారు. అలా అపహాస్యంగా, వ్యంగ్యంగా జగన్ విషయంలో స్పందించిన
దివాకర్ రెడ్డి ఇప్పుడు జగన్ తమ వాడంటూ మాట్లాడారు.

జగన్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసు అని దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకు సాన్నిహిత్యం ఉండేదని, చిన్న చిన్న విబేధాలు మాత్రం ఉండేవని జేసీ చెప్పుకొచ్చారు. ఇలా వైఎస్ కుటుంబంతో తనకు అత్యంత సాన్నిహిత్యం ఉందని జేసీ చెప్పుకొచ్చారు. అయితే తాము పార్టీ మారేది ఉండదని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు!