Home రాజకీయాలు ఆరోగ్య శ్రీ కి వైఎస్ టచ్..జగన్ ప్రత్యేక దృష్టి

ఆరోగ్య శ్రీ కి వైఎస్ టచ్..జగన్ ప్రత్యేక దృష్టి

SHARE

వైద్య ఆరోగ్య శాఖ పై ప్రత్యేక దృష్టిని సారించనున్నట్టుగా ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో జగన్ మోహన్ రెడ్డి సోమవారం రోజున సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో జగన్ కీలకమైన ప్రకటనలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మీద తనే ప్రత్యేక దృష్టి సారించబోతూ ఉన్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

ప్రభుత్వాసుపత్రుల్లో సామాన్యులకు సరైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాలను మెరుగు పరచాలని జగన్ ఆదేశించారు. ఆసుపత్రుల్లో చిన్నారులను ఎలుకలు కొరకడాలు వంటి సంఘటనలు గత ప్రభుత్వహయాంలో చోటు చేసుకున్నాయని, అలాంటి వాటిని పూర్తిగా అరికట్టాలని జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

అలాగే ఆరోగ్య శ్రీ విషయంలో కూడా జగన్ స్పందించారు. ఆరోగ్య శ్రీ పేరును మార్చుతున్నట్టుగా కూడా జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆరోగ్య శ్రీని చంద్రబాబు ప్రభుత్వం ‘ఎన్టీఆర్ వైద్య సేవ’గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. వైఎస్ హయాంలో మొదలైన ఆ కార్యక్రమానికి మొదట ‘రాజీవ్ ఆరోగ్య శ్రీ’ అని నామకరణం చేశారు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చాకా ఆ సంక్షేమ పథకానికి ‘ఎన్టీఆర్ వైద్య సేవ’ అని పేరు పెట్టారు.

అయితే ఇప్పుడు ఆ పథకం పేరు మారుస్తున్నట్టుగా జగన్ తెలిపారు. ఇక నుంచి ఆ పథకాన్ని ‘డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ’గా వ్యవహరించబోతున్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.ఆరోగ్య శ్రీ పథకం మొదలైంది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే. ఈ నేపథ్యంలో ఆయన పేరునే ఆ పథకానికి పెట్టారు ఆయన తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.