Home రాజకీయాలు ఏపీ సీఎం వైఎస్ జగన్.. తొలి సంతకం..గ్రామీణ యువతకు ఉత్సాహం!

ఏపీ సీఎం వైఎస్ జగన్.. తొలి సంతకం..గ్రామీణ యువతకు ఉత్సాహం!

SHARE

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తొలి నిర్ణయాన్ని యువతరాన్ని ఆకట్టుకునేలా తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెద్దగా లేక ఇబ్బందుల్లో ఉన్న యువతరాన్ని ఆకట్టుకునేలా జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు పదిహేనులోగా ఏపీలో దాదాపు నాలుగు లక్షల మందిని వలంటీర్లు గా తీసుకోనున్నట్టుగా జగన్ ప్రకటించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడమే వారి పని. దీనికి గానూ వారికి ఐదు వేల రూపాయల మొత్తాన్ని గౌరవ భత్యంగా ఇవ్వనున్నట్టుగా జగన్ ప్రకటించారు.

ఆగస్టు పదిహేను లోగానే వారందరి నియామకం పూర్తి అవుతుందని జగన్ తెలిపారు. అలాగే అక్టోబర్ రెండు నాటికి ప్రతి గ్రామ సచివాలయానికి పది మంది చొప్పున సిబ్బందిని తీసుకోనున్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. తద్వారా మూడు లక్షల మంది యువతీయువకులకు కనీస ఉపాధిని చూపున్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం జగన్ మోహన్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. అలాగే వృద్ధాప్య పెన్షన్ల మొత్తాన్ని పెంచుతూ ఇచ్చిన హామీని అమలు పరుస్తూ జగన్ మోహన్ రెడ్డి తన తొలి సంతకాన్ని చేశారు.

జూన్ నెల నుంచినే వృద్ధాప్య పెన్షన్ మొత్తాన్ని పెంచుతున్నట్టుగా, వచ్చే నెల నుంచి రెండు వేల రెండు వందల యాభై రూపాయల మొత్తాన్ని పెన్షన్ మొత్తంగా చెల్లించనున్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. తద్వారా వృద్ధుల సంక్షేమానికి జగన్ ప్రాధాన్యతను ఇచ్చారు. దశలవారీగా వృద్ధాప్య పెన్షన్ మొత్తం పెరుగుతూ ఉంటుందని మూడు వేల రూపాయలకు చేరుతుందని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.

ఇక అవినీతి నిరోధానికి ప్రాధాన్యతను ఇవ్వబోతున్నట్టుగా, ప్రతి వ్యవహారం పారదర్శకంగా ఉంటుందని జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పాలనా పరమైన సంస్కరణలకు జగన్ ఇలా శ్రీకారం చుట్టారు.