Home రాజకీయాలు ఆత్మ విశ్వాసంతో వైఎస్సార్సీపీ, అభద్రతా భావంలో టీడీపీ!

ఆత్మ విశ్వాసంతో వైఎస్సార్సీపీ, అభద్రతా భావంలో టీడీపీ!

SHARE

మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఇలాంటి తరుణంలో ఎన్నికల ఫలితాలపై రాజకీయ పార్టీల అభిమానుల్లో, ఆయా పార్టీల శ్రేణుల్లో పరిస్థితి ఎలా ఉందంటే.. ఒక విషయం స్పష్టం అవుతోందని విశ్లేషకులు అంటున్నారు.

ఈ ఎన్నికల్లో విజయం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. తాము సంచలన విజయాన్ని సాధిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విశ్వాసంతో చెబుతూ ఉన్నాయి. పోలింగ్ కు ముందు నుంచినే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. ఇక పోలింగ్ తర్వాత కూడా ఆ పార్టీలో అదే కాన్ఫిడెన్సే కనిపిస్తూ ఉంది.

పోలింగ్ అనంతరం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కానీ, ఆ పార్టీ శ్రేణులు కానీ ఎక్కడా బెదిరినట్టుగా కనిపించడం లేదు. ఇక ఎగ్జిట్ పోల్స్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని వివిధ ఎగ్జిట్ పోల్ సర్వేలు స్పష్టం చేశాయి.

ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలో మాత్రం మొదటి నుంచి అభద్రతాభావం నెలకొని ఉంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు మాట్లాడిన తీరును బట్టి చూస్తేనే వారి పార్టీ విజయం పట్ల వారిలోనే విశ్వాసం లేదనే విషయం స్పష్టం అవుతూ వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.

ఇక చంద్రబాబు నాయుడు ఈవీఎంల మీద పదే పదే అనుమానాలు వ్యక్తం చేయడం, ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని అనడం, సైకిల్ కు ఓటేస్తే ఫ్యాన్ కు పడిందని వ్యాఖ్యానించడం.. ఇవన్నీ కూడా చంద్రబాబులోని ఓటమి భయాన్ని బయటపెట్టాయని పరిశీలకులు పేర్కొన్నారు.

గురువారం ఫలితాలు వెల్లడి అవుతున్న తరుణంలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్లు కొత్త కొత్త వివాదాలు రేపడానికి, ఈవీఎంల మీద , కౌంటింగ్ మీద అనుమానాలు పెంచడానికే ప్రయత్నాలు సాగిస్తూ ఉండటం గమనార్హం.
స్థూలంగా ఇదీ పరిస్థితి. తమ విజయం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటే.. తెలుగుదేశం పార్టీ మాత్రం అభద్రతాభావంలో ఉంది. ఇక అసలు పరిస్థితి ఏమిటో మరి కొన్ని గంటల్లోనే పూర్తిగా తేలిపోనుంది!