Home రాజకీయాలు ఉత్కంఠకు మరి కాసేపట్లో తెర..!

ఉత్కంఠకు మరి కాసేపట్లో తెర..!

SHARE

ఫలితాల కోసం వేచి చూసిన రోజులే నలభైకి పైగా ఉన్నాయి! అంతకు ముందు ఎన్నికల నామినేషన్ల పర్వం, ప్రచార పర్వం అంతా కలుపుకుంటే ఒక నెల రోజులు! స్థూలంగా డెబ్బై రోజుల పైనే అత్యంత ఉత్కంఠ రాజకీయ పరిస్థితి నెలకొని ఉంది.

వాస్తవానికి ఈ ఎన్నికలపై ఉన్న ఉత్కంఠ ఈ డెబ్బై రోజులదే కాదు. అంతకు ముందు ఆరేడు నెలల నుంచి కూడా పొలిటికల్ హీట్ పతాక స్థాయిలోనే ఉండింది. అనేక రాజకీయ పరిణామాలు సంభవిస్తూ వచ్చాయి. గెలుపు ఎవరిది అవుతుందనే అంశం గురించి ఏడెనిమిది నెలల నుంచినే పెద్ద ఎత్తున చర్చ కొనసాగింది.

మరి అలాంటి ఉత్కంఠకు అంతా మరి కాసేపట్లో తెరపడనుంది. గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచినే పోలింగ్ ప్రక్రియ మొదలుకానుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలు కానున్నదని ఏపీ ఎన్నికల కమిషనర్ గోపాలకృష్ణ ద్వివేదీ వివరించారు. ఇరవై నిమిషాల్లోనే పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు పూర్తి అవుతుందని వివరించారు.

ఎనిమిది గంటలా ఇరవై నిమిషాల నుంచి ఈవీఎంల కౌంటింగ్ మొదలవుతుందని ఆయన పేర్కొన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ట్రెండే ఒక రకంగా ఫలితాల గురించి ఎంతో కొంత క్లారిటీ ఇస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్క రౌండ్ వారీగా ఫలితాల గురించి ప్రకటనలు వస్తూ ఉంటాయి. ఐదారు రౌండ్లు ముగిసే సరికి మొత్తం ఫలితాల మీదే కొంత వరకూ క్లారిటీ రావొచ్చు.

ఎలాగూ హంగ్ తరహా ఫలితాలు ఉండవని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా ఉంటుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో స్వీప్ చేసేస్తుందని, ల్యాండ్ స్లైడ్ విక్టరీని సాధిస్తుందని కూడా కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు పేర్కొన్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్నే అంతా ఎక్స్ పెక్ట్ చేస్తూ ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో నెగ్గుతుందని సామాన్య ప్రజానీకం కూడా చెబుతున్నారు. మరి అందుకు సంబంధించిన స్పష్టత కేవలం మరి కొన్ని గంటల్లోనే రానుంది.