Home రాజకీయాలు లగడపాటి సర్వే… టీడీపీ వాళ్లకే నమ్మకం లేదా!

లగడపాటి సర్వే… టీడీపీ వాళ్లకే నమ్మకం లేదా!

SHARE

‘ఆ బెజవాడోడి మాటలు నమ్మి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు చాలా మంది బెట్టింగులు వేశారు. అలాంటి వారు ఆరు వందల కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. హైదరాబాద్ లో ఒక పెళ్లికి వెళితే లగడపాటి సర్వేని నమ్మి బెట్టింగులు వేసి డబ్బులు పోగొట్టుకున్నట్టుగా చాలా మంది చెప్పుకుని బాధపడ్డారు. అసలు ప్రజల నాడిని పట్టడం లగడపాటికి ఏం తెలుసు? అలాంటి సర్వేలు ఎందుకు చేయాలి.. అవి చాలా ప్రమాదకరం..’ అని వ్యాఖ్యానించారు తెలుగుదేశం నేత, చంద్రబాబు నాయుడి కేబినెట్లో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రడు!

లగడపాటి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తనది ఎగ్జిట్ పోల్ కాదంటూ ఒకసారి, అది ఎగ్జిట్ పోల్ అంటూ మరోసారి లగడపాటి హడావుడి చేశాడు. తవని అంచనాలు మాత్రమే అని, అవి నిజం కాకపోయినా ఆశ్చర్యం లేదని ఆయనే చెప్పుకొచ్చాడు. అయితే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా మాత్రం లగడపాటి సర్వేను చూపించి ఆ పార్టీ శ్రేణుల్లో స్థైర్యం నింపే ప్రయత్నం చేస్తూ ఉంది. దేశంలోని ప్రముఖ వార్తా సంస్థల ఎగ్జిట్ పోల్స్, అనేక అధ్యయన సంస్థలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ఖాయమని చెబుతూ ఉన్నాయి. వాటి పోస్ట్ పోల్ సర్వేలన్నీ అదే మాటే చెప్పాయి. అయితే లగడపాటి సర్వే మాత్రం తెలుగుదేశం పార్టీ నెగ్గుతుందని చెప్పుకొచ్చింది. ఇది వరకూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు లగడపాటి వెలువరించిన అంచనాలు నిజం కాలేదు.

అందుకు పూర్తి విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. దీంతో ఏపీ ఎన్నికల విషయంలో ఆయన చెబుతున్న మాటలపై చాలా మంది లో నమ్మకం లేకుండా పోయింది. అయితే తెలుగుదేశం లోని కొందరు మాత్రం లగడపాటి సర్వే లో తమ పార్టీ గెలుస్తోందని చెప్పుకుంటూ హడావుడి చేస్తూ ఉన్నారు.

అయితే అందుకు భిన్నంగా అయ్యన్నపాత్రుడు మాత్రం లగడపాటిపై ఎగ్జిట్ పోల్ విషయంలో విరుచుకుపడ్డారు. లగడపాటి సర్వేలో తెలుగుదేశం పార్టీ నెగ్గుతోందంటూ పేర్కొన్నా.. ఆ సర్వేను తెలుగుదేశం పార్టీ వాళ్లే నమ్మడం లేదని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ అవసరం లేదేమో అని పరిశీలకులు అంటున్నారు.