Home రాజకీయాలు వైఎస్ జగన్ కు బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి పిలుపులు!

వైఎస్ జగన్ కు బీజేపీ నుంచి, కాంగ్రెస్ నుంచి పిలుపులు!

SHARE

కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు విషయంలో అటు రెండు కూటముల నుంచి పిలుపులు అందుతున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని వివిధ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీకి 18 నుంచి 20 వరకూ ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉందని ప్రధానమైన ఎగ్జిట్ పోల్ అధ్యయనాలు పేర్కొన్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ వైఎస్సార్సీపీ 22,24 ఎంపీ సీట్లను కూడా నెగ్గవచ్చని అంచనా వేశాయి.

ఇలాంటి నేపథ్యంలో జగన్ పార్టీ మద్దతు కోసం కేంద్రంలోని కూటములు వేచి ఉన్నాయి. కేంద్రంలో బీజేపీకే లీడ్ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అయితే మరింత భద్రమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి జగన్ సపోర్టును బీజేపీ కోరకుంటున్నట్టుగా తెలుస్తోంది. అందుకోసం అమిత్ షా నిర్వహిస్తున్న విందుకు జగన్ కు ఆహ్వానం వచ్చినట్టుగా సమాచారం. ఎన్డీయేలోని పార్టీలకూ, యూపీయేతర తటస్థ పార్టీలకు షా ఆహ్వానాలు పంపారట. అందులో వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా ఉన్నారని తెలుస్తోంది.

బీజేపీ వాళ్లు ఇలా జగన్ ను రమ్మంటుండగా.. కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా జగన్ కు ఫోన్లు చేస్తున్నట్టుగా సమాచారం. కేంద్రంలో మద్దతు కాంగ్రెస్ కే ఇవ్వాలని వారు కోరుతున్నారట. ఈ మేరకు జగన్ కు కాంగ్రెస్ ముఖ్యనేతల నుంచి ఫోన్లు వస్తున్నట్టుగా సమాచారం.

అయితే ఈ విషయంలో జగన్ ఒకే అభిప్రాయంతో ఉన్నారని, రాష్ట్ర ప్రయోజనాలకు ముఖ్యమైన ప్రత్యేక హోదాను ఇచ్చే వారికే మద్దతు పలకాలని జగన్ ఇప్పటికే నిర్ణయించినట్టుగా అదే మాటకు కట్టుబడి ఉండే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.