Home రాజకీయాలు ఎగ్జిట్ పోల్స్: మళ్లీ మోడీ హవా.. ఈ సారి మరింతగా!

ఎగ్జిట్ పోల్స్: మళ్లీ మోడీ హవా.. ఈ సారి మరింతగా!

SHARE

కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్. వివిధ జాతీయ మీడియా వర్గాల ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ గతంతో పోలిస్తే మరింత ఘనమైన విజయాన్ని సాధించనుంది! ఆ పార్టీకి ఎన్డీయే కూటమి రూపంలో మూడు వందలకు పైగా ఎంపీ సీట్లు వస్తాయని వివిధ టీవీల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు పేర్కొనడం విశేషం.

భారతీయ జనతా పార్టీ కూటమికి మూడు వందల అరవై ఎంపీ సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని కూడా కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేయడం గమనార్హం! అదే జరిగితే సంచలనమే అని చెప్పాలి.

-యూపీలో మహాఘట్ బంధన్ అంటూ ఎస్పీ-బీఎస్పీలు చేతులు కలిపినా పెద్దగా ప్రయోజనం లేదని ఎగ్జిట్ పోల్ సర్వేలు అంటున్నాయి. ఆ రెండు పార్టీలూ చేతులు కలిపినా రెండంకెల నంబర్ స్థాయిలో ఎంపీ సీట్లను సాధించడం కష్టమే అని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి.

-మధ్యప్రదేశ్, రాజస్తాన్ లలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినా లోక్ సభ ఎన్నికల్లో మాత్రం అలాంటి అవకాశం లేదని వివిధ చానళ్ల ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి.

-అంతకన్నా ఆశ్చర్యం ఏమిటంటే.. బీజేపీ వాళ్లు పశ్చిమ బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో గణనీయమైన స్థాయిలో ఎంపీ సీట్లను సాధించగలరని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతూ ఉండటం.

-కాంగ్రెస్ పార్టీ కొద్దో గొప్పో కోలుకున్నా.. యూపీఏ రూపంలో అది వంద ఎంపీ సీట్లను సాధించడం కూడా కష్టమే అని ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతూ ఉన్నాయి.

-కేంద్రంలో కాంగ్రెస్ కూటమి కానీ, ఫెడరల్ ఫ్రంట్ కు కానీ అధికారం అందే అవకాశాలు ఏమాత్రం లేవని, బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. వాస్తవ ఫలితాలు ఈ గురువారం విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.