Home రాజకీయాలు ‘వైఎస్సార్ తో..’ ఉండవల్లి పుస్తకం ఆవిష్కరణ

‘వైఎస్సార్ తో..’ ఉండవల్లి పుస్తకం ఆవిష్కరణ

SHARE

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రచించిన ‘వైఎస్సార్ తో..’ పుస్తకం ప్రముఖుల మధ్యన ఆవిష్కరించారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి వైఎస్ తో తనకున్న జ్ఞాపకాలను వివరించారు. కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, వైఎస్ హయాంలో పని చేసిన మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనతో పని చేసిన అనుభవాలను వివరించారు.

ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రుల్లో ఎన్టీఆర్, వైఎస్సార్ లు మాత్రమే ముందుంటారని జాస్తి చలమేశ్వర్ అన్నారు. ఫ్యాక్షన్ ప్రభావితం ప్రాంతం అయిన కడప నుంచి వచ్చిన రెడ్డి అయినా మంచి మెత్తని మనసున్న రెడ్డి అని వైఎస్ ను కొనియాడారు మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి. ఆయన సీఎంగా ఉన్నప్పుడు సీఎస్ గా పని చేసిన ఆయన తన అనుభవాలను వివరించారు.

వైఎస్‌ను 1987లో కడప ఎస్పీగా ఉన్నపుడు తొలిసారి చూశానని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ అర్వింద్ తెలిపారు. ఒక రాజుకు ఉండాల్సిన లక్షణాలు వైఎస్‌లో ఉండేవని కొనియాడారు. విధి లీలగా ఆయన మరణం జరిగిందేమోనని వ్యాఖ్యానించారు. టైం మేనేజ్మెంట్ గురించి వైఎస్ దగ్గర నేర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణా రావు అన్నారు. అనవసరపు సమీక్షలు, చర్చ ఉండేది కాదన్నారు. మానవత్వం ఉన్న మనిషి వైఎస్ఆర్ అని కొనియాడారు.

ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ నా శ్రీమతి అనడం నాకు గర్వకారణమని కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఈ పుస్తకం ద్వారా మళ్లీ వైఎస్‌ను గుర్తు చేసుకునే అవకాశం కల్పించారని అన్నారు. వైఎస్సార్‌ను తాము తలచుకోని రోజు ఉండదని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సతీమణి ఉండవల్లి జ్యోతి అన్నారు. మామూలు కార్యకర్తగా ఉన్న అరుణ్‌కుమార్‌ను ఇంత స్థాయికి తెచ్చిన ఘనత వైఎస్ఆర్దేనన్నారు.