Home రాజకీయాలు చంద్రబాబు ఆఖరి కేబినెట్ మీటింగ్.. ఏం తేల్చారంటే!

చంద్రబాబు ఆఖరి కేబినెట్ మీటింగ్.. ఏం తేల్చారంటే!

SHARE

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి ఆఖరి కేబినెట్ భేటీ ముచ్చట ముగిసింది. ఈ కేబినెట్ భేటీ విషయంలో చంద్రబాబు నాయుడు ఎంతగా పట్టుబట్టారో అందరికీ తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు కు కేబినెట్ భేటీకి అవకాశం లేకుండా పోయింది. అయితే ఆయన మాత్రం తను కేబినెట్ సమావేశాన్ని నిర్వహించేదే అంటూ పట్టుపట్టారు.

ముందుగా తేదీని కూడా ప్రకటించేశారు. అయితే చంద్రబాబు తగ్గాల్సి వచ్చింది. కేబినెట్ భేటీకి తేదీని సైతం ప్రకటించేసి, ఆ రోజు ‘అధికారులు ఎందుకు సమావేశానికి రారో చూస్తా…’అంటూ హెచ్చరిక జారీ చేసిన చంద్రబాబు నాయుడు ఆ తర్వాత మాత్రం వెనక్కు తగ్గారు. ముందుగా చెప్పిన తేదీకి కేబినెట్ భేటీని నిర్వహించలేకపోయారు.

ఆ తర్వాత చేసేది లేక ఎన్నికల కమిషన్ అనుమతి తెచ్చుకుని కేబినెట్ ను సమావేశ పరుచుకున్నారు. చంద్రబాబు ఆఖరి కేబినెట్ భేటీకి అనుమతిని ఇస్తూనే ఎన్నికల కమిషన్ షరతులు పెట్టింది. కేబినెట్ భేటీలో ఇష్టానుసారం వ్యవహరించేందుకు వీల్లేదని, ఆర్థిక సంబంధ విషయాల్లో నిర్ణయాలకు అవకాశం లేదని, అంచనాలను పెంచడానికి వీల్లేదని ఈసీ స్పష్టం చేసింది ఎన్నికల కమిషన్.

ఆ పరిమితులకు లోబడే చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించుకోవాల్సి వచ్చింది. కరువు, తుఫాన్ తదితర అంశాల గురించి చర్చించినట్టుగా తెలుస్తోంది. అయితే ముందుగా అనుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు ఈ భేటీని అడ్డు పెట్టుకుని తమ వాళ్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోలేకపోయారని తెలుస్తోంది.

పనిలో పనిగా అధికారులను అభినందించారట చంద్రబాబు నాయుడు. తద్వారా వారిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. మొత్తానికి చంద్రబాబు ఆఖరి కేబినెట్ భేటీ అలా ముగిసింది.