Home రాజకీయాలు టీవీ 9 లో ముగిసిన రవి ప్రకాష్ దాష్టికం!

టీవీ 9 లో ముగిసిన రవి ప్రకాష్ దాష్టికం!

SHARE

తనను టీవీ నైన్ నుంచి ఎవరూ తొలగించలేదు, తనను ఎవరూ ఏమీ చేయలేరు.. అంటూ చెప్పుకొచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే ఆ చానల్ నుంచి రవి ప్రకాష్ తొలగింపబడ్డాడు. ఈ విషయాన్ని టీవీ నైన్ నూతన యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. రవి ప్రకాష్ ఇక ఎంతమాత్రమూ టీవీ నైన్ సీఈవో కాదు అని టీవీ నైన్ నూతన యాజమాన్యం ప్రకటించింది.

రవి ప్రకాష్ స్థానంలో తాత్కాలికంగా మరొకరిని సీఈవోగా నియమించినట్టుగా కూడా నూతన యాజమాన్యం ప్రకటించింది. టీవీ నైన్ నూతన డైరెక్టర్లు తమను తాము పరిచయం చేసుకున్నారు. ప్రెస్ మీట్ పెట్టి.. అన్ని విషయాలనూ కూలంకషంగా ప్రకటించి వారు రవి ప్రకాష్ ను టీవీ నైన్ నుంచి తొలగించిన విషయాన్ని తెలిపారు. ఆయనపై తాము మోపిన అభియోగాల గురించి కూడా వారు వివరించారు.

టీవీ నైన్ రవి ప్రకాష్ గా పేరు గాంచినప్పటికీ అతడికి టీవీ నైన్ లో ఉన్న వాటా కేవలం ఎనిమిది శాతమే అని ఆ చానల్ నూతన యాజమాన్యం మరోసారి ప్రకటించింది. తొమ్మిది నెలల క్రితమే టీవీ నైన్ లో తాము వాటాను కొనుగోలు చేసినట్టుగా అలంద మీడియా ప్రతినిధులు తెలిపారు. ఎనిమిది శాతం వాటా ఉన్న రవి ప్రకాష్ తమను నియంత్రించాలని చూసినట్టుగా తెలిపారు.

వాటాదార్లందరి అభిప్రాయాలను తీసుకుని రవి ప్రకాష్ ను సీఈవో పోస్టు నుంచి తొలగించినట్టుగా తెలిపారు. రవి ప్రకాష్ ఒక డైరెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన విషయంపై ఫిర్యాదును కూడా నూతన యాజమాన్యం ధ్రువీకరించింది. దేవేంద్ర అగర్వాల్ అనే డైరెక్టర్ సంతకాన్ని రవి ప్రకాష్ ఫోర్జరీ చేసినట్టుగా డైరెక్టర్లు తెలిపారు.

టీవీ నైన్ తో ఇక రవి ప్రకాష్ కు ఏ మాత్రం సంబంధం లేదు అని, అతడితో ఎవరైనా ఆర్థిక వ్యవహారాలను టీవీ నైన్ పేరుతో జరిపినా తమకు సంబంధం లేదని నూతన యాజమాన్యం తెలిపింది. ఇప్పటికీ ఎనిమిది శాతం వాటా రవి ప్రకాష్ కు ఉందని… ఆ వాటాదారుగా ఆయన టీవీ నైన్ సమావేశాలకు హాజరు కావొచ్చని నూతన యజమానులు ప్రకటించారు.