Home రాజకీయాలు బాబుకు ప్రశాంతత లేకుండా పోయిందా.. ఓటమి భయమా!

బాబుకు ప్రశాంతత లేకుండా పోయిందా.. ఓటమి భయమా!

SHARE

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వరస పెట్టి సమీక్షలు నిర్వహిస్తున్న వైనం పై రకరకాల కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. పోలింగ్ పూర్తి అయిపోయిన నేపథ్యంలో ఈ సమయంలో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు ఆయనలోని అసహనాన్ని బయటకు చాటుతోందని పరిశీలకులు అంటున్నారు. పోలింగ్ పూర్తి అయ్యింది కాబట్టి.. నేతలంతా సేదతీరుతున్నారు.

ఏపీకి సంబంధించిన నేతలే కాదు..దేశ వ్యాప్తంగా ఎన్నికల గోదాలో ఉన్న నేతలంతా.. పోలింగ్ పూర్తి అయిన నేపథ్యంలో విరామాలు తీసుకుంటున్నారు. విశ్రాంతి తీసుకుంటున్నారు. విహారాలు చేస్తూ ఉన్నారు. అయితే వాళ్లలా చంద్రబాబు నాయుడు మాత్రం ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడని పరిశీలకులు అంటున్నారు.

చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో వరస పెట్టి సమీక్షలు నిర్వహించడం, మరోవైపు అధికారుల తో ఏదో ఒక పేచీ పెట్టుకునేందుకు బాబు ప్రయత్నాలు సాగిస్తూ ఉండటం ఆయన మానసిక స్థితిని తెలియజేస్తోందని వారు అంటున్నారు. సాధారణంగా అభద్రతా భావంతో ఉన్న వారే ఇలా పేచీలు పెట్టుకోవడం, అందరూ తన చుట్టూ ఉండి తనకు ధైర్యం చెప్పాలని అనుకోవడం చేస్తూ ఉంటారనేది విశ్లేషకులు మాట. చంద్రబాబు నాయుడు తీరులో ఈ రెండు ధోరణులూ కనిపిస్తూ ఉన్నాయి.

ముందుగా చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘం అధికారులతో గొడవ పెట్టుకున్నారు. వాళ్ల మీద తన రుబాబు ఎక్కువ సేపు సాగదని బాబుకు అర్థం అయ్యింది. ఆ తర్వాత సీఎస్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇష్యూ ఏమీ లేకపోయినా..చంద్రబాబు నాయుడు ఇలా అధికారుల మీద ఫైర్ అయిపోతూ ఉన్నారు. వారి మీద విరుచుకుపడుతూ ఉన్నారు. ఇదంతా బాబులోని అసహనానికి ప్రతీక అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరోవైపు చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో సమీక్షలు అంటూ రోజూ హడావుడి చేస్తున్నారు. వారికి ధైర్యం చెబుతున్నట్టుగా మాట్లాడుతూ.. తను ఊరట పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారని స్పష్టం అవుతోంది. ‘పార్టీ గెలుస్తోంది..గెలుస్తోంది..’ అని పదే పదే చెబుతూ బాబు తనలోని అభద్రతా భావాన్ని చాటుకుంటున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.