Home సినిమా బీజేపీకి సినీతారలు భలే దొరుకుతున్నారే, ఇంకో హీరోకి ఎంపీ టికెట్!

బీజేపీకి సినీతారలు భలే దొరుకుతున్నారే, ఇంకో హీరోకి ఎంపీ టికెట్!

SHARE

ఈ దఫా ఎన్నికల్లో సినీ గ్లామర్ ను గట్టినే నమ్ముకుంది భారతీయ జనతా పార్టీ. అందు కోసం ఎక్కడెక్కెడి వారిని కూడా కమలం పార్టీ కదిలిస్తోంది. ఉత్తరాది, దక్షిణాది తేడా లేకుండా అనేక మంది సినిమా వాళ్లకు బీజేపీ ఈ సారి ఎంపీ టికెట్లు ఇచ్చింది. ఈ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున సినీ సెలబ్రిటీలను పోటీ చేయించడానికి బీజేపీ చాన్నాళ్లుగానే ప్రయత్నాలు సాగిస్తూ వచ్చింది.

అందు కోసం అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి అనేక మందిని కలిశారు. మాధురీ దీక్షిత్, కపిల్ దేవ్ వంటి వాళ్లను కూడా కలిసి అమిత్ షా వారిని రాజకీయాల్లోకి ఆహ్వానించినట్టుగా వార్తలు వచ్చాయి. వారికి బీజేపీ తరఫున ఎంపీ టికెట్లు ఇచ్చేందుకు షా ఆసక్తి చూపించారట. అయితే వారు రాలేదు కానీ.. వేరే వాళ్లు మాత్రం కదిలారు.

ఈ క్రమంలో పలువురు సినీ తారలు బీజేపీ తరఫున ఎంపీలుగా పోటీకి దిగారు. ఉత్తరాదిన హేమమాలిని, జయప్రద వంటి తారలు బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థులుగా ఉన్నారు. ఇక దక్షిణాదిన సుమలతకు బీజేపీ మద్దతు ప్రకటించింది. కేరళలో సురేష్ గోపి భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీగా పోటీలో ఉన్నారు.

ఇక వీరే కాదు.. ఇంకా మరి కొంతమందిని కూడా బీజేపీ లాగుతూ ఉంది. తాజాగా ఆ జాబితాలో చోటు సంపాదించారు సన్నీ డియోల్. ఒకప్పటి ఈ బాలీవుడ్ స్టార్ హీరోకి బీజేపీ ఎంపీ టికెట్ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. పంజాబ్ నుంచి సన్నీడియోల్ ను బరిలోకి దించాలనేది భారతీయ జనతా పార్టీ ప్రణాళికగా తెలుస్తూ ఉంది.

అధికారం చేతిలో ఉన్న వేళా విశేషమో ఏమో కానీ.. భారతీయ జనతా పార్టీకి అయితే పోటీలో దించడానికి చాలా మంది సినీ సెలబ్రిటీలు దొరుకుతూ ఉన్నారు!