Home రాజకీయాలు సింగిల్‌ సీటూ కష్టమే.. రాహుల్‌కు పదవి త్యాగమట

సింగిల్‌ సీటూ కష్టమే.. రాహుల్‌కు పదవి త్యాగమట

SHARE

– సోషల్‌ మీడియాలో దేవెగౌడపై భారీ విమర్శలు

కర్ణాటకలో మూడో పార్టీగా అవతరించిన జనతాదళ్‌ సెక్యులర్‌ పార్టీ.. సింగిల్‌ సీటు గెలవడం కూడా కష్టంగా ఉందని సమాచారం. అయితే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ప్రధాని ట్యాగ్‌తో.. పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రధాని పదవిపై తనకు ఆశ లేదని.. రాహుల్‌గాంధీ కోసం ప్రధాని పదవిని త్యాగం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈసారి ఎన్నికల్లో ఈ పెద్దమనిషి తుమకూరు నుంచి జేడీఎస్‌ అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే అక్కడ ఆయన గెలుపు కూడా అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఆయన పార్టీ పోటీ చేస్తున్నది కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే.. గెలుపు అంటే సింగిల్‌ సీటు కూడా అనుమానంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రధాని పదవిని త్యాగం చేయడం ఏంటని నెటిజన్లు విమర్శిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా.. దళపతిపై సెటైర్లు మొదలయ్యాయి.

నెటిజన్ల విమర్శలు ఇలా..
– ప్రస్తుతం ప్రధానిగా ఉంటే.. పదవిని త్యాగం చేయడం అంటారు.
– గతంలో 1996లో ప్రధాని పదవి చేపట్టారు. ప్రస్తుతం ప్రధాని రేసులో కూడా లేరు.
– సొంత సీటు గెలవడమూ కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవెగౌడను ఎవరూ ప్రధానిగా వస్తారని ఊహించలేదు.
– ముందుగానే పదవిని త్యాగం చేస్తున్నట్లు ప్రకటించడం ఏంటి?
– పార్టీ ఆవిర్భావం నుంచి కూడా 1996 మినహా ఎప్పుడూ రెండంకెల సీట్లు సాధించిన దాఖలాలు లేవు.
– 1996లో మాత్రమే కర్ణాటకలో జనతాదళ్‌ అత్యధికంగా 16 స్థానాలు గెలిచింది.
– గత ఎన్నికల్లో జేడీఎస్‌ అభ్యర్థుల కంటే నోటాకే ఎక్కువ వచ్చిన సంగతి గుర్తు చేసుకోవాలి.
– కేవలం 16 స్థానాలతో 1996లో ప్రధాని.. కర్ణాటకలో 58 సీట్లతో 2006లో సీఎం, 38 ఎమ్మెల్యే స్థానాలతో 2018లో సీఎం పదవి చేపట్టారు.
– ఈసారి జేడీఎస్‌కు ఒక్క ఎంపీ సీటు రావడం కష్టమే. కాంగ్రెస్‌తో మైత్రి నిండా ముంచుతోంది.
– తాజా ఎన్నికల్లో 12 సీట్లు కోరారు. ఎనిమిది సాధించారు. ఏడింట పోటీ చేస్తున్నారు. కేవలం మూడు స్థానాలపై దృష్టి పెట్టారు.

ఏడు చోట్ల పోటీ.. మూడు గెలిస్తే చాలు
భారతీయ జనతా పార్టీని అధికారం నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్‌తో జత కట్టిన జేడీఎస్‌ 12 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని భావించినా.. కాంగ్రెస్‌ 8 స్థానాలను కేటాయించింది. అందులో జేడీఎస్‌ ఏడు చోట్ల మాత్రమే అభ్యర్థులను బరిలో దింపి బెంగళూరు ఉత్తర స్థానాన్ని కాంగ్రెస్‌కే వదిలేసింది. అయితే కేవలం మండ్య, తుమకూరు, హాసన్‌ స్థానాలపై మాత్రమే దృష్టి సారించారు. తుమకూరు నుంచి హెచ్‌డీ మాజీ ప్రధాని దేవెగౌడ, మండ్య నుంచి సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్, హాసన్‌ నుంచి రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ పోటీలో ఉన్నారు.

జేడీఎస్‌ కంటే నోటాకే ఎక్కువ
గత 2014 ఎన్నికల్లో కర్ణాటకలోని 28 స్థానాలకు గానూ జేడీఎస్‌ 25 చోట్ల పోటీ చేసింది. అయితే కేవలం మండ్య, హాసన్‌ స్థానాలు మాత్రమే విజయం సాధించింది. మూడు (బెళగావి, భాగల్‌కోటె, ధారవాడ) స్థానాల్లో నోటాకు వచ్చిన ఓట్ల కంటే జేడీఎస్‌ అభ్యర్థికి తక్కువగా రావడం విశేషం. మరో 20 స్థానాలకు గానూ 10 లోక్‌సభ స్థానాల్లో ఆరు శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కలబుర్గి, బళ్లారి, హావేరి, ఉడుపి – చిక్కమగళూరు లోక్‌సభ స్థానాల్లో నోటాకు.. జేడీఎస్‌కు కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే తేడా ఉన్నాయి. అదేవిధంగా రాయచూరు, బెంగళూరు సెంట్రల్, దక్షిణలో రెండు శాతం తేడా ఉంది. కాగా దావణగెరె, చామరాజనగర, బెంగళూరు ఉత్తర, బీదర్‌ లోక్‌సభ స్థానాల్లో జేడీఎస్‌ తగిన ప్రాబల్యం చూపలేకపోయింది.