Home రాజకీయాలు టీడీపీ కాన్ఫిడెన్స్ మరింత తగ్గిపోయింది!

టీడీపీ కాన్ఫిడెన్స్ మరింత తగ్గిపోయింది!

SHARE

పోలింగ్ కు ముందే ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా ఉండవచ్చనే అంచనాలు వినిపించాయి. వివిధ జాతీయ మీడియా వర్గాల సర్వేలు, వివిధ అధ్యయన సంస్థల పరిశీలనలు.. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే అంచనాలను వేశాయి. ఇక పోలింగ్ తర్వాత కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది.

పోలింగ్ తర్వాత ఇంకా ఎగ్జిట్ పోల్స్ గట్రా ఏమీ విడుదల కావడానికి లేదు. ఈసీ వాటి విషయంలో బ్రేకులు వేసింది. ఇలాంటి క్రమంలో ఎవరు గెలుస్తారనే అంశం మీద చర్చ జరుగుతూ ఉంది. పోలింగ్ అనంతరం వివిధ పార్టీ లు స్పందిస్తున్న తీరు.. నేత హవభావాలు.. వంటి వాటిని బట్టి ఎవరు లీడ్ లో ఉంటారో అర్థం చేసుకోవచ్చని పరిశీలకులు, ప్రజలు అనుకుంటూ ఉన్నారు.

అందులో భాగంగా నేతల తీరును అంతా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన పోలింగ్ రోజు నుంచి ఒకటే గోల పెడుతూ ఉన్నారు. ఈవీఎంలు పని చేయలేదంటూ బాబు గోల చేస్తున్నారు. ముప్పై శాతం ఈవీఎంలు పని చేయలేదని, ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తున్నారు.

అది ఓటమికి సంకేతం అని, అందుకే బాబు అలా మాట్లాడుతూ ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు, ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. పోలింగ్ తర్వాత జనం ముందుకు వచ్చినప్పుడు జగన్ నింపాదిగా స్పందించారు. దాన్ని బట్టి జగన్ విజయం మీద కాన్ఫిడెంట్ గా ఉన్నారనే మాట వినిపిస్తూ ఉంది.

ఈ క్రమంలో తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాకు వెళ్లి తమ వారితో సమీక్షను నిర్వహించారు. పోలింగ్ జరిగిన తీరు, విజయావకాశాల గురించి బాబు అక్కడ చర్చించడానికి కర్నూలు జిల్లా టీడీపీ నేతలను పిలిచారాయన.

అయితే అక్కడి నేతలు బాబు సమీక్షకు హాజరు కాలేదు. ఏకంగా సగం మంది అభ్యర్థులు అటు వైపుకు రాలేదు. భూమా అఖిలప్రియ, కేఈ ప్రతాప్, కేఈ శ్యామ్, తిక్కారెడ్డి.. ఇలాంటి వాళ్లు ఏడు మంది సమావేశానికి హాజరు కాలేదని తెలుస్తోంది. పద్నాలుగు సీట్లలో ఏడు మంది హాజరు కాకపోవడం పరిస్థితికి దర్పణం పడుతోంది. గెలుపు ఆశలుంటే.. వాళ్లంతా ఆ బాబు సమీక్షకు హాజరయ్యే వారనే లాజికల్ వాదన వినిపిస్తోంది. ఈ వాదన తెలుగుదేశం పార్టీ కాన్ఫిడెన్స్ ను మరింత దెబ్బతీస్తోందని పరిశీలకులు అంటున్నారు.