Home రాజకీయాలు ఊర్మిల కూడా రాజకీయం నేర్చేసిందే!

ఊర్మిల కూడా రాజకీయం నేర్చేసిందే!

SHARE

ప్రధానమంత్రి నరేంద్రమోడీ జీవిత కథతో రూపొందిన సినిమా ‘పీఎం నరేంద్రమోడీ’ ఈ ఎన్నికల ముందు పెద్ద దుమారమే రేపుతూ ఉంది. ఈ సినిమాపై ఇప్పటికే తీవ్ర వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఆ వివాదం అనేక మలుపులు తిరిగి.. చివరకు ఈ సినిమా విడుదలను ఆపే వరకూ వచ్చింది. ప్రస్తుతానికి అయితే ఎన్నికల ముందు ఈ సినిమా విడుదల అవుతుందా, లేదా.. అనేది ఇంకా తేలాల్సి ఉంది.

అందుకు సంబంధించి విచారణలు, వీక్షణలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ సంగతలా ఉంటే.. ఈ సినిమా విషయంలో కాంగ్రెస్, బీజేపీల మద్యన పోరుసాగుతూ ఉంది. ఈ సినిమాను తేలిక చేసి మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ. ఈ సినిమాలో మోడీ పాత్రలో నటించిన వివేక్ ఒబెరాయ్ ఆ విషయంలో కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీకి మోడీ అంత సీన్ లేదని, రాహుల్ గురించి బయోపిక్ తీసేందుకు ఏమీ లేదని వివేక్ ఎద్దేవా చేశారు.

రాహుల్ బయోపిక్ తీస్తే దాన్ని చాలా వరకూ థాయ్ లాండ్ లో తీసుకోవాలని ఆయన అన్నారు. అలాంటి మాటలకు ఇప్పుడు ఊర్మిల కౌంటర్ ఇచ్చింది. ముంబై లోని ఒక నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసిన ఊర్మిల మోడీ బయోపిక్ మీద విమర్శలు చేసింది.

‘మోడీ మీద కామెడీ సినిమా తీసుకోవచ్చు..’ అని ఆమె వ్యాఖ్యానించింది. ‘ఎన్నో హామీలు ఇచ్చిన తనకు యాభై ఆరు ఇంచ్ ల ఛాతి ఉందన్న ఆయన అన్ని హామీల అమల్లోనే వైఫల్యం చెందిన విధానాన్ని ఆ సినిమాలో చూపించాలి..’ అని ఊర్మిల చెప్పుకొచ్చింది. మొత్తానికి ఊర్మిల కూడా రాజకీయాలను తొందరగానే ఒంటపట్టించుకుంటున్నట్టుగా ఉంది.