Home రాజకీయాలు జనసేన… ఆశలే ఐదింటిపైన, అసలు కథేమిటో!

జనసేన… ఆశలే ఐదింటిపైన, అసలు కథేమిటో!

SHARE

మాటల్లోనేమో తమ పార్టీ అధికారంలోకి వస్తుంది.. తను సీఎం అయిపోవడం ఖాయమంటూ ప్రకటించుకున్నారు జనసేన అధిపతి. మాటలు అయితే అలా కోటలు దాటాయి కానీ, పవన్ కల్యాణ్ వాస్తవంలో మాత్రం అందుకు తగ్గ స్థాయిలో కష్టపడలేదు అనేది అందరికీ తెలిసినేది. ఒక రాష్ట్రంలో రాజకీయ పార్టీని నిలబెట్టుకోవాలంటే, ఎన్నికల్లో పోరాడాలంటే పవన్ లా పై పైన తిరిగితే కుదిరే పని కాదు అనేది చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు.

అసలు పవన్ కల్యాణ్ చాలా నియోజకవర్గాల్లో కనీసం ప్రచారానికి కూడా వెళ్లలేదు అనేది తెలిసిన సంగతే. రాజకీయ పార్టీని పెట్టినప్పటి నుంచి, ఇటీవలి ఎన్నికల ప్రచారం ముగిసే వరకూ కూడా పవన్ కల్యాణ్ అడుగుపెట్టని నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. ఇటీవలి ఎన్నికల ప్రచారంలో కూడా పవన్ కల్యాణ్ గట్టిగా తిరిగింది ముప్పై నియోజకవర్గాలు కూడా లేవు!
అలాగని ఎన్నికల ప్రచారానికి ముందు ఏమైనా వేరే నియోజకవర్గాలను కవర్ చేశారా అంటే..అది కూడా లేదాయె! మరి సరిగ్గా రాష్ట్రమంతా తిరగ కుండానే అధికారాన్ని సాధించుకోవడం ఏ మేరకు సాధ్యమో పవన్ కల్యాణ్ కే తెలియాల్సింది.

ఇక పోలింగ్ పూర్తి అయిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ పార్టీ పరిస్థితి గురించి, ఆ పార్టీ వాళ్లు, విశ్లేషకులు రకరకాల అంచనాలు వేస్తూ ఉన్నారు. వాటి ప్రకారం చాలా మంది చెబుతున్న మాట పవన్ పార్టీ ఒకటి నుంచి రెండు సీట్లలో విజయం సాధించే అవకాశాలున్నాయనేది! అవేవి అంటే ఎవరూ కచ్చితంగా చెప్పడం లేదు.

అయితే జనసేన ఆశలు ఐదారు నియోకవర్గాల మీద ఉన్నాయట. వాటిల్లో రెండు పవన్ పోటీ చేసినవే. భీమవరం, గాజువాక.. వీటిల్లో పవన్ రెండు గెలవొచ్చు. లేదా కనీసం గాజువాకలో ఖాయమని జనసేన వర్గాలు అనుకుంటున్నాయట. రాజోలు, రాజమండ్రి రూరల్ లలో కూడా జనసేన పోటీ ఇచ్చిదని అంటున్నారు. ఇవీ గెలిచే అవకాశాలున్నాయని పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటున్నారు.

తెనాలి, తాడేపల్లి గూడెం, యలమంచిలి నియోజకవర్గాల్లో కూడా తమ వాళ్లు పోటీ ఇచ్చారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. స్థూలంగా ఈ ఐదారు సీట్ల విషయంలో ఆ పార్టీ ఆశలు కనిపిస్తున్నాయి. మరి అసలు కథ ఏమిటో ఫలితాలు వెల్లడి అయితే కానీ తెలియదు!