Home రాజకీయాలు ఆ జిల్లాలో పుంజుకోనున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ

ఆ జిల్లాలో పుంజుకోనున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ

SHARE

– చెరో ఏడు సీట్లు వస్తాయంటున్న విశ్లేషకులు
– అయితే రెండు పార్టీల్లోనూ 10 స్థానాలపై దీమా

ఆరంభం నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అనంతపురం జిల్లాలో ఈసారి కూడా సగం పైగా సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే గత 2014 ఎన్నికల్లో జిల్లాలోని 14 స్థానాలకు గానూ 12 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే ఈసారి వైఎస్సార్‌సీపీ పుంజుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సుమారు ఏడు పైగా సీట్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా టీడీపీ కూడా ఏడు స్థానాల వరకు విజయం సాధించవచ్చు. అయితే రెండు పార్టీల్లోనూ 10 స్థానాల్లో గెలుస్తామనే ధీమా ఉంది. అంతేకాకుండా జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో సగం స్థానాల్లో (ఏడు) గెలుపు దాదాపు ఖరారైనట్లే. మిగతా ఏడు స్థానాల్లో ఫలితం ఇప్పుడు చెప్పలేం అంటున్నారు. జిల్లాలోని రెండు పార్లమెంటు సీట్లలో టీడీపీ – వైఎస్సార్‌సీపీ తలా ఒకటి గెలుస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే టీడీపీ, వైఎస్సార్‌సీపీ నాయకులు మాత్రం రెండు స్థానాల్లో తామే గెలుస్తామని ధీమాగా ఉన్నారు. ఈ సస్పెన్స్‌కు మే 23వ తేదీన తెర పడనుంది.

టీడీపీకి అనుకూలంగా ఉండే స్థానాలు
జిల్లాలోని 14 స్థానాలకు గానూ గత 2014 ఎన్నికల్లో 12 స్థానాల్లో (ఉరవకొండ, కదిరి మినహా) టీడీపీ గెలిచింది. అయితే ఈసారి టీడీపీకి దెబ్బ పడనుంది. జిల్లాలో ఏడు స్థానాల్లో గెలవడమే గగనంగా మారింది. జిల్లా వ్యాప్తంగా టీడీపీకి అనుకూలంగా సీట్లను పరిశీలిస్తే హిందూపురం, తాడిపత్రి, ఉరవకొండ, అనంతపురం, పుట్టపర్తి, మడకశిర, పెనుకొండ స్థానాల్లో టీడీపీకి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు.

వైఎస్సార్‌సీపీ గెలుపు స్థానాలు
జిల్లాలోని హోరాహోరీగా సాగిన పోరులో ఈసారి వైఎస్సార్‌సీపీ పుంజుకున్నట్లు తెలుస్తోంది. రాప్తాడు, ధర్మవరం, కదిరి, కళ్యాణదుర్గం, రాయదుర్గం, శింగనమల, గుంతకల్లు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. అంతేకాకుండా పోటాపోటీగా ఉన్న మిగతా ఏడు స్థానాల్లోనూ కొన్నింట వైఎస్సార్‌సీపీ గెలిచే అవకాశం లేకపోలేదు.

ఎంపీ స్థానాల విషయంలో..
‘అనంతపురం, హిందూపురం పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. గత 2014 ఎన్నికల్లో రెండు స్థానాల్లో టీడీపీ గెలిచింది. కాగా ఈసారి రెండింట వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. లేనిపక్షంలో చెరో సీటు సాధించే అవకాశం ఉందని చెప్పవచ్చు. హిందూపురం పార్లమెంటు పరిధిలో రాప్తాడు, ధర్మవరం, కదిరి, పెనుకొండ అసెంబ్లీ స్థానాలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఫలితంగా ఆయన గెలుపు ఈజీ అని చెప్పవచ్చు. దీనికి తోడు సిట్టింగ్‌ ఎంపీ నిమ్మల కిష్టప్పకు హిందూపురం, మడకశిర, పుట్టపర్తిలో అంతంత మాత్రంగా ఆదరణ ఉంది.

జేసీ పవన్‌ గెలిచేనా?
అనంతపురం ఎంపీ టీడీపీ అభ్యర్థిగా జేసీ పవన్‌కుమార్‌రెడ్డి బరిలో దిగారు. అయితే ఆయనకు తాడిపత్రి, అనంతపురం, గుంతకల్లు, శింగనమల అసెంబ్లీ స్థానాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ స్థానాలు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తలారి రంగయ్యకు మెజారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా అనంతపురం సిటీలో కూడా ఆయనకు బలం లేకపోలేదు. ఫలితంగా హోరాహోరీ పోరులో స్పష్టమైన ఫలితం ఇప్పుడే చెప్పలేం. ఎవరు గెలిచినా మెజారిటీ తక్కువగానే ఉండే అవకాశం ఉంది.

కచ్చితంగా గెలిచే సీట్లు ఇవే.. (అంచనా)
హిందూపురం – టీడీపీ
మడకశిర – టీడీపీ
తాడిపత్రి – టీడీపీ
గుంతకల్లు – వైఎస్సార్‌సీపీ
శింగనమల – వైఎస్సార్‌సీపీ
రాయదుర్గం – వైఎస్సార్‌సీపీ
రాప్తాడు – వైఎస్సార్‌సీపీ

ఫలితం చెప్పలేనివి
ఉరవకొండ – టీడీపీకి అనుకూలం
ధర్మవరం – వైఎస్సార్‌సీపీ వైపు
పెనుకొండ – టీడీపీ గెలిచే అవకాశం
కదిరి – వైఎస్సార్‌సీపీ గెలవచ్చు
పుట్టపర్తి – టీడీపీ గెలిచే అవకాశం
అనంతపురం – టీడీపీకే చాన్స్‌
కళ్యాణదుర్గం – వైఎస్సార్‌సీపీ