Home సినిమా 2019 ప్రపంచకప్ కు టీమిండియా సభ్యులు వీరే!

2019 ప్రపంచకప్ కు టీమిండియా సభ్యులు వీరే!

SHARE

ఎట్టకేలకూ ప్రపంచకప్ లో పాల్గొన బోయే టీమ్ వివరాలను ప్రకటించారు బీసీసీఐ సెలెక్టర్లు. ఇంగ్లండ్ లో జరిగే ఈ సారి క్రికెట్ వరల్డ్ కప్ లో టీమిండియా తరఫున ఎవరెవరికి స్థానం లభిస్తుంది అనే అంశంపై గట్టి చర్చే జరిగింది. ఆ విషయంలో మాజీలు, విశ్లేషకులు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారి అంచనాలను తగ్గట్టుగానే టీమిండియా ప్రకటన జరిగింది. దాదాపుగా సమతూకం పాటిస్తూ సెలెక్టర్లు వరల్డ్ కప్ టీమ్ ను ప్రకటించారు.

విరాట్ కొహ్లీ కెప్టెన్సీలోనే టీమిండియా ఈ సారి వరల్డ్ కప్ లో పాల్గొంటోంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ యథాతథంగా కొనసాగుతూ ఉన్నారు.
కేఎల్ రాహుల్ స్పెషలిస్టు బ్యాట్స్ మన్ గా జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. గత కొన్నాళ్లుగా రాహుల్ కెరీర్లో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అయినా అతడికి ఛాన్స్ దక్కడం లక్కీనే అని చెప్పాలి.

ప్రపంచకప్ అనంతరం రిటైర్మెంట్ ఖాయమని అనుకుంటున్న మహేంద్ర సింగ్ ధోనీకి స్థానం లాంఛనంగానే లభించింది. ప్రత్యామ్నాయ కీపర్ గా దినేష్ కార్తిక్ స్థానం సంపాదించుకున్నాడు.

విజయ్ శంకర్, హార్ధిక్ పాండ్యాలు ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్స్ గా జట్టులో స్థానం సంపాదించుకోగా, రవీంద్ర జడేజా స్పిన్ ఆల్ రౌండర్ గా ఉండబోతున్నాడు. కేదార్ జాదవ్ కు కూడా చోటు లభించింది. ఇతడు కూడా పార్ట్ టైమ్ బౌలింగ్ చేయగలడు.

బుమ్రా, భువనేశ్వర్, షమీలు సీమ్ దళంలో ఉంటారు. వీరి ప్రదర్శనే ఇంగ్లండ్ లో టీమిండియా విజయావకాశాలను ప్రభావితం చేయనుంది.

ఇక యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ లు స్పిన్ బలగానికి నేతృత్వం వహించనున్నారు. ఇది పదిహేను మందితో కూడిన, ప్రపంచకప్ ఆడబోయే ఇండియన్ క్రికెట్ జట్టు.