Home సినిమా సీనియర్ నటి vs జూనియర్ హీరో.. ఆసక్తి రేపుతున్న పోరు!

సీనియర్ నటి vs జూనియర్ హీరో.. ఆసక్తి రేపుతున్న పోరు!

SHARE

కర్ణాటకలోని మండ్య పార్లమెంటు సమరం తారస్థాయికి చేరింది. జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించింది. జేడీఎస్‌ తరఫున సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్, మరోవైపు స్వతంత్య్ర అభ్యర్థి సుమలత పోటీలో ఉండటమే కారణంగా చెప్పవచ్చు. దీనికి తోడు సిద్ధరామయ్య వర్గం సుమలతకు పరోక్షంగా మద్దతు ఇస్తోందనే ప్రచారం.. బీజేపీ నేరుగా మద్దతు ప్రకటించడంతో సుమలత విజయంపై హైప్‌ క్రియేట్‌ చేశారు. అయితే మండ్య పార్లమెంటు పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ జేడీఎస్‌ ప్రాతినిద్యం వహిస్తుండటం.. సీఎం తనయుడు కావడం.. సినీనటుడు కావడంతో నిఖిల్‌ గెలుపుపై జేడీఎస్‌ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే స్వతంత్య్ర అభ్యర్థి సుమలత విజయం సాధించి 50 ఏళ్ల రికార్డును తిరగరాస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నిఖిల్‌ ఏం అన్నారంటే..
నేను ఎవరికీ పోటీ కాదు. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికే రాజకీయాల్లోకి వచ్చాను. గత 25 ఏళ్లుగా నియోజకవర్గ సమస్యలను చూస్తున్నా. సీఎం కుమారస్వామి మండ్య జిల్లా అభివృద్ధికి రూ.8,761 కోట్లు కేటాయించడం శుభసూచకం. ఇంతవరకు ఏ సీఎం కూడా ఇంత భారీ స్థాయిలో నిధులు కేటాయించలేదు. మాకు నియోజకవర్గ వ్యాప్తంగా ఓటు బ్యాంకు ఉంది. తప్పక గెలుస్తాం. ఢిల్లీ తరహాలో స్మార్ట్‌ స్కూళ్లను ఏర్పాటు చేస్తాం. సినీరంగం నుంచి వచ్చినప్పటికీ రాజకీయం కొత్త కాదు. మా తాతల కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాం.

నేనే సమర్థ అభ్యర్థిని – స్వతంత్య్ర అభ్యర్థి సుమలత
రాజకీయాలు తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చాను. నా భర్త హఠాన్మరణంతో ఆయన అభిమానులు, సినీనటులు ఎన్నికల బరిలో దిగాలని కోరారు. అయితే ప్రత్యర్థి బలంగా ఉన్నారని తెలుసు. కానీ గెలుపోటములు సమస్య కాదు. ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయలేదు. జిల్లాలో రైతుల సమస్యలు చాలా ఉన్నాయి. వాటి గురించి పార్లమెంటులో ప్రశ్నిస్తా. నియోజకవర్గంలో నేను సమర్థ అభ్యర్థి అని భావిస్తున్నా.

విజయావకాశాలు
– జేడీఎస్‌ అభ్యర్థి నిఖిల్‌ అయినప్పటికీ సీఎం కుమారస్వామి బరిలో ఉన్నంతగా ప్రిస్టేజి సమస్యగా తీసుకున్నారు. ఎలాగైనా కుమారుడిని గెలిపించుకోవాలని సీఎం కుమారస్వామి సవాల్‌గా తీసుకున్నారు.
– కాంగ్రెస్‌ మద్దతుతో జేడీఎస్‌ అభ్యర్థి నిఖిల్‌ బరిలో దిగారు. అయితే కాంగ్రెస్‌ కార్యకర్తల నుంచి సంపూర్ణ సహకారం అందలేదని సీఎం కుమారస్వామి ఆరోపించారు.
– కాంగ్రెస్‌ నుంచి నటి సుమలత టికెట్‌ ఆశించారు. అయితే మైత్రిధర్మంలో భాగంగా జేడీఎస్‌కు కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చింది. ఫలితంగా సుమలత స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగింది. ఈక్రమంలో మాజీ సీఎం సిద్ధరామయ్య పాత్ర ఉన్నట్లు సమాచారం.
– మండ్య స్థానం కాంగ్రెస్‌కు వదిలిపెట్టాలని పార్టీ పెద్దలు కోరినా జేడీఎస్‌ నేతలు ఒప్పుకోలేదు. ఫలితంగా పరోక్షంగా సుమలత గెలుపునకు కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది.
– మాజీ మంత్రి అంబరీశ్‌ హఠాన్మరణం అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో సానుభూతి ముందు విజయం కష్టమని భావించిన బీజేపీ పోటీ నుంచి తప్పుకుంది. ఈ సందర్భంగా స్వతంత్య్ర అభ్యర్థి సుమలతకే మద్దతు ప్రకటించింది.
– కాంగ్రెస్‌ తరఫున మండ్య నుంచి అంబరీశ్‌ మూడుసార్లు ఎంపీగా గెలిచారు. ఈ క్రమంలో ఆయన భార్య సుమలత కూడా కాంగ్రెస్‌ టికెట్‌ మాత్రమే ఆశించారు.
– స్వతంత్య్ర అభ్యర్థి సుమలతకు భర్త అంబరీశ్‌ అభిమానుల బలం ఉంది. ఆయన హఠాన్మరణం చెందారనే సానుభూతి కలిసొస్తుంది.
– కాంగ్రెస్‌ నాయకులు పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా బీజేపీ పూర్తి సహకారం అందించింది. సినీరంగం నుంచి భారీ మద్దతు. ఈమేరకు నటులు యశ్, దర్శన్‌ ఇప్పటికే ప్రచారం కూడా చేశారు.
– ఇద్దరు ప్రధాన అభ్యర్థులు ఒక్కళిగ సముదాయానికి చెందిన వారే. ఫలితంగా జిల్లాలో అత్యధికంగా ఉన్న ఒక్కళిగ సామాజికవర్గం ఓటర్లు సమానంగా వచ్చే అవకాశం ఉంది. ఎవరికీ బలం చేకూరదు.
– ఒక్కళిగ ఓటర్లను నమ్ముకున్న జేడీఎస్‌కు భారీ దెబ్బ పడే అవకాశం ఉంది. గతేడాది జరిగిన విధానసభ ఎన్నికల్లో సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా జేడీఎస్‌కు ఓటు వేశారు తప్ప పార్టీపై అభిమానంతో కాదని సమాచారం.
– స్థానిక రైతుల నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ఈక్రమంలో సీఎం కుమారస్వామికి రైతులు ఎవరూ మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. చెరుకు రైతులకు సీఎం కుమార న్యాయం చేయలేదని రైతులు చెబుతున్నారు.