Home రాజకీయాలు పరిటాల శ్రీరామ్‌కు ఓటమి భయం

పరిటాల శ్రీరామ్‌కు ఓటమి భయం

SHARE

రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీకి అనుకూల వాతావరణం కనిపిస్తుండటంతో టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌కు ఓటమి భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన నామినేషన్‌ సమయం నుంచి పోలింగ్‌ జరిగే రోజు వరకు నిత్యం అమాయక ప్రజలపై దౌర్జన్యం చేసేందుకు యత్నించారు. తమకే ఓటు వేయాలని బెదిరించారు. అయితే ప్రజలు తిరగబడ్డారు. పోలింగ్‌ బూత్‌ల్లోకి రానీయకుండా.. పరిటాల శ్రీరామ్‌.. గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. అయితే ఆగ్రహావేశంతో ఊగిపోయిన యువనేత మీసాలు మెలేస్తూ.. వెళ్లిపోయారు. రామగిరి మండలంలో ఆరంభం నుంచి డామినేషన్‌ చేస్తున్న శ్రీరామ్‌.. పోలింగ్‌ సమయానికి రాప్తాడు, ఆత్మకూరు మండలాలకు వచ్చారు. రాప్తాడు మండలం మరూరు గ్రామంలోకి రాకుండా అక్కడి ప్రజలు అడ్డుకున్నారు.

అనంతరం ఆత్మకూరు మండలం తోపుదుర్తికి వెళ్లారు. అక్కడ వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దురుసుగా మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే ‘మీ అంతు చూస్తా’ అని బెదిరించసాగారు. అంతేకాకుండా అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులు వాహనాల అద్దాలు పగలగొట్టారు. దీంతో తోపుదుర్తి గ్రామస్తులు తిరగబడ్డారు. వెంటనే పరిటాల శ్రీరామ్‌ తన వెంట వచ్చిన వారిని తీసుకుని వెళ్లిపోయారు. ఇంతకాలం తల్లి పరిటాల సునీత కొంగు చాటున రాజకీయాలు చేస్తూ వచ్చిన పరిటాల శ్రీరాం.. ఈ ఎన్నికల్లో గెలుపుతో తన రాజకీయ జీవితాన్ని అరంగేట్రం చేసేందుకు కుట్రలకు తెరలేపాడు. ఎన్నికల అధికారులను లోబరుచుకొని ఈవీఎం మూత వేయడానికి నకిలీ సీళ్లను సష్టించారు. అయితే స్థానిక వైఎస్సార్‌సీపీ ఎన్నికల ఏజెంట్లు అనుమానంతో ఆ సీళ్లను పరిశీలించారు. దీంతో అవి నకిలీ సీళ్లుగా బయటపడ్డాయి. దీనిపై వారు ఎన్నికల అధికారులను ప్రశ్నిస్తే

ఎలాంటి సమాధానం ఇవ్వలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డితో పాటు ఎన్నికల ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం స్థానిక అధికారులతో ఈవీఎం ప్యాక్‌లకు ఒరిజినల్‌ సీళ్లు వేయించి వాటిని తరలించారు. ప్రజావ్యతిరేకతను గుర్తించిన టీడీపీ నాయకులు ఈ ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదన్న ఉద్దేశంతో ఇలాంటి కుట్రలకు తెరలేపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

తాను ఎమ్మెల్యే అభ్యర్థిని ఎక్కడికైనా వెళ్తానని పరిటాల శ్రీరామ్‌ చెప్పారు. అడ్డు వచ్చిన గ్రామస్తులను పక్కకు నెట్టి ముందుకు వెళ్లడంతో అక్కడే ఉన్న మరికొంత మంది గ్రామస్తులు అడ్డుపడ్డారు. వారికి తోడుగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు రావడంతో తోపుదుర్తిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక్కడి నుంచి వెనక్కు వెళ్లాలని లోపలికి వెళ్లనిచ్చేదే లేదంటూ గ్రామస్తులతో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుపడ్డారు. అయితే వీరిని పక్కకు నెట్టేయండి అంటూ అనుచరులకు శ్రీరాం హుకుం జారీ చేశారు.

శ్రీరామ్‌ వైపు అనుచరులు, టీడీపీ నాయకులు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో గ్రామస్తులు అధిక సంఖ్యలో రావడంతో ఒక్క సారిగా పరిటాల శ్రీరాంతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలను బయటకు నెట్టి వేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఎంత వారించినా పరిటాల శ్రీరాంను లోపలికి వెళ్లనిచ్చేందుకు గ్రామస్తులు ససేమిరా అన్నారు. చేసేది లేక పరిటాల శ్రీరామ్‌ అక్కడి నుంచి వెనుతిరిగాడు. ఎమ్మెల్యే అయిన వెంటనే గ్రామంలోకి వచ్చి నన్ను అడ్డుకున్న ప్రతి ఒక్కరిని గ్రామ బహిష్కరణ చేస్తానంటూ శ్రీరామ్‌ మీసం మేలేసి వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది.