Home రాజకీయాలు పవన్ కల్యాన్ రెండు చోట్ల ఓడతారా? జనసేన పరిస్థితి ఏమిటి?

పవన్ కల్యాన్ రెండు చోట్ల ఓడతారా? జనసేన పరిస్థితి ఏమిటి?

SHARE

పోలింగ్ అనంతరం ఏపీలో ఎక్కడా మూడో పార్టీ పేరు వినిపించలేదని అంటున్నారు విశ్లేషకులు. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ జరిగిందని.. జనసేన పోటీలో కూడా లేదని వారు విశ్లేషిస్తూ ఉన్నారు.

ఈ ఎన్నికల పోరులో జనసేన ఊసులో లేకుండా పోయిందనే మాట వినిపిస్తూ ఉంది విశ్లేషకుల నుంచి. ప్రత్యేకించి గ్రేటర్ రాయలసీమ పరిధిలో జనసేన పూర్తిగా జీరో అని తేలిపోయింది. ఇక పవన్ చాలా ఆశలు పెట్టుకున్న ఉత్తరాంధ్రలో కూడా అంత అనుకూల పరిస్థితి ఏమీ లేదని, కేవలం గోదావరి జిల్లాల్లో మాత్రమే కాస్తో కూస్తో అని అంటున్నారు.

అయితే అక్కడ కూడా గెలిచేసేది ఏమీ లేదని..కొద్దిగా ఓట్లు మాత్రం పడినట్టుగా ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయినా ఈ ఎన్నికల్లో నెగ్గి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెడతారా? అనేది ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.

వాటిల్లో భీమవరంలో పవన్ రాణింపు కష్టమే అనే విశ్లేషణలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. ఇక పోలింగ్ తర్వాత అయితే..గాజువాకలో కూడా పవన్ కల్యాణ్ నెగ్గడం కష్టమనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

గాజువాకలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి గట్టి పోటీ ఇచ్చారని, పవన్ కల్యాణ్ మీద ఆయన విజయం సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నట్టుగా తెలుగుదేశం అనుకూల మీడియానే చెబుతూ ఉండటం విశేషం!