Home సినిమా ‘యాత్ర’ ప్రసారానికి గ్రీన్ సిగ్నల్.. టీడీపీకి ఎదురుదెబ్బ!

‘యాత్ర’ ప్రసారానికి గ్రీన్ సిగ్నల్.. టీడీపీకి ఎదురుదెబ్బ!

SHARE

టీవీలో ‘యాత్ర’ సినిమా ప్రసారాన్ని ఆపించాలని ప్రయత్నించిన తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సినిమాను టీవీలో ప్రసారం కాకుండా అడ్డుకోవడానికి ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లింది తెలుగుదేశం పార్టీ. ఎన్నికల వేళ ఆ సినిమాను టీవీలో ప్రసారం చేయడానికి వీల్లేదని తెలుగుదేశం వాళ్లు వాదించారు. అయితే టీడీపీ నేతల వాదనతో ఈసీ ఏకీభవించలేదు.

ఆ సినిమా ప్రసారాన్ని అడ్డుకునే ఉద్దేశం లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ సినిమాలో ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు ఏవీ లేవని ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీకి చెప్పింది. అలాగే టీవీలో సినిమా ప్రసారాన్ని ఆపే అధికారం తమకు లేదని, థియేటర్లలో, టీవీ చానళ్లలో ఏ సినిమాలను ప్రసారం చేసుకోవచ్చని ఈసీ స్పష్టం చేసింది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ‘ప్రజా ప్రస్థాన పాదయాత్ర’ ఆధారంగా ‘యాత్ర’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ మమ్ముట్టీ వైఎస్ పాత్రను చేసిన ఆ సినిమా కమర్షియల్ గా కూడా హిట్ అయ్యింది. వైఎస్ అభిమానులను ఆ సినిమా ఎంతగా ఆకట్టుకుందో వేరే చెప్పనక్కర్లేదు.

కమర్షియల్ గా పది కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించిన ఆ సినిమా ఇప్పుడు టీవీలో ప్రసారం కానుంది. పోలింగ్ కు నాలుగు రోజుల ముందు ఆ సినిమా ప్రసారం అవుతుండటం.. తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెడుతూ ఉంది. అందుకే వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం ఆ సినిమా ప్రసారానికి అడ్డం చెప్పలేదు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దీంతో ఈ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ‘స్టార్ మా’ లో ‘యాత్ర’ సినిమా టెలివిజన్ ప్రీమియర్ షో ప్రసారం కానుంది.