Home సినిమా హీరోయిన్ కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారు!

హీరోయిన్ కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారు!

SHARE

ముంబై నార్త్ నుంచి నటి ఊర్మిలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారు అయ్యింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ఊర్మిలకు వెనువెంటనే ఇలా ఆ పార్టీ టికెట్ ఖరారు కావడం ఆసక్తిదాయకమైన అంశమే. ఒకప్పటి ఈ గ్లామరస్ హీరోయిన్ ని ఎన్నికల వేళ ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఆమెను చేర్చుకుంది. అయితే చేరిక రోజేమో పోటీ గురించి ఇంకా ఆలోచించుకోనట్టుగా ఊర్మిల చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఈమెకు ముంబై నార్త్ టికెట్ ఖరారు అయ్యిందని సమాచారం అందుతోంది.

ముంబై నార్త్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది వరకూ కూడా ఇక్కడ బాలీవుడ్ స్టార్ హీరో ఒకరు విజయం సాధించారు. అతడే గోవింద. ఆ బాలీవుడ్ స్టార్ హీరో రెండు వేల నాలుగులో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ తరఫునే విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో గోవింద..రామ్ నాయక్ వంటి బీజేపీ సీనియర్ మీద, నాటి కేంద్రమంత్రి మీద విజయం సాధించి ఆశ్చర్యపరిచారు.

అయితే ఆ తర్వాతి ఎన్నికల్లో గోవిందకు కాంగ్రెస్ పార్టీ అక్కడ టికెట్ ఇవ్వలేదు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత అక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముంబై నార్త్ లో ఓటమి పాలైంది. శివసేన-బీజేపీ ఎంపీ క్యాండిడేట్ అక్కడ విసయం సాధించారు.

ఈ సారి మరో బాలీవుడ్ స్టార్ ను బరిలోకి దించుతోంది కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు గోవిందను నిలబెట్టి విజయం సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఊర్మిలను గెలిపించుకుంటుందేమో చూడాలి!