Home రాజకీయాలు వివేక హత్య.. బాబుపై ఈసీకి ఫిర్యాదు!

వివేక హత్య.. బాబుపై ఈసీకి ఫిర్యాదు!

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన ఇష్టానుసారం ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ వివేకానందరెడ్డి హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు చంద్రబాబు నాయుడు తనకు ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానించారు. వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేయించారు, ఎవరు హత్య చేశారనే అంశాల గురించి తేలకనే చంద్రబాబు నాయుడు తన సొంత వ్యాఖ్యానాలు చేశారు.

వివేకానందరెడ్డిని ఆయన ఇంట్లో వాళ్లే హత్య చేయించారని కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. చంద్రబాబు నాయుడు రాజకీయం కోసం ఏమైనా మాట్లాడగలడు అని, తనకు తోచినట్టుగా మాట్లాడుతున్నాడని ఆయనపై విమర్శలు వచ్చాయి.

ఆఖరికి వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత రంగంలోకి దిగి ఈ విషయంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పేరును ఆమె ఎత్తలేదు కానీ, కొందరు పెద్ద మనుషులు ‘లూజ్ టాక్’ చేస్తున్నారంటూ ఆమె బాబు తీరుపై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు మాటలపై అలాంటి ప్రతిస్పందన వచ్చింది. దీంతో చంద్రబాబు నాయుడు గప్ చుప్ అయిపోయాడు.

ఆ సంగతలా ఉంటే.. తన తండ్రి హత్య విషయంలో తెలుగుదేశం నేతలు, తెలుగుదేశం అనుకూల మీడియా చాటిన పైత్యం పై వైఎస్ సునీత ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. తన తండ్రి హత్య కేసు విషయంలో సాగుతున్న విచారణను ప్రభావితం చేసేలా చంద్రబాబు నాయుడు మాట్లాడారనే ఆరోపణలతో ఆమె ఈసీని ఆశ్రయించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యానాలను ఆమె ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. బాబు తీరుపై ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించి పేపర్ క్లిప్స్ ను కూడా అందించారని సమాచారం.

ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలవాలని వైఎస్ సునీత భావిస్తున్నారని సమాచారం. మొత్తానికి తనకు ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు ఝలక్ తగిలేలా ఉంది.