Home రాజకీయాలు పరిటాల ఇలాఖాలో తోపుదుర్తికి నీరా‘జనం’

పరిటాల ఇలాఖాలో తోపుదుర్తికి నీరా‘జనం’

SHARE

మంత్రి పరిటాల సునీత ఇలాఖాలో రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి జనాలు నీరాజనం పలికారు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని.. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని.. అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రకాశ్‌రెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి గురువారం రామగిరి మండలంలోని కుంటిమద్ది, గంతిమర్రి, పోలేపల్లి, చెర్లోపల్లి, పెనుబోలు, కలికివాండ్లపల్లి, శ్రీహరిపురం, శేషంపల్లి గ్రామాల్లో పర్యటించారు.

ఈ సందర్భంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అయితే మంత్రి పరిటాల సునీత మరోసారి పోలీసులతో అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేశారు. జాతీయ రహదారిపై ఎన్‌ఎస్‌ గేటు వద్దనే పలు వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి సునీత ఆదేశాల మేరకు అనుమతి రద్దు చేసినట్లు తెలిపారు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు చెందిన వందల వాహనాలు ఎన్‌హెచ్‌ పైనే నిలిచిపోయాయి. దీనికి తోడు ఆయా గ్రామాల్లో కూడా బైక్‌ ర్యాలీలను పోలీసులు అడ్డుకున్నారు. ఏ గ్రామానికి చెందిన వారు ఆ గ్రామంలోనే ఉండాలని ఆంక్షలు విధించారు. ఫలితంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి వెంట కేవలం కొన్ని వాహనాలను మాత్రమే అనుమతించారు. పైగా బహిరంగ సభలు, సమావేశాలు, ఈలలు, కేకలు ఉండకూడదని ఆంక్షలు విధించారు.

గత నాలుగున్నరేళ్లుగా మంత్రి పరిటాల సునీత సొంత గ్రామమైన రామగిరిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరిస్తూ వచ్చారు. మంత్రి సునీత ఒత్తిడితో పోలీసులు వైఎస్సార్‌ సీపీ నేతలను కూడా రామగిరి మండలంలోనికి అనుమతించిన దాఖలాలు లేవు. ప్రతిసారీ అడ్డుకోవడమే పనిగా మంత్రి సునీత పోలీసులను హెచ్చరించారు. తాజాగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పరిస్థితులు మారాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో రాప్తాడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి రామగిరి మండలం ఎన్నికల ప్రచారానికి పోలీసులు అనుమతిచ్చారు.

దీంతో భారీ పోలీసు బందోబస్తు నడుమ తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి రామగిరి మండలంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. ప్రకాశ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో రామగిరి మండలంలోని ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సునీత తమ గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి చేయలేదని ప్రకాశ్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రకాశ్‌రెడ్డికి మద్దుతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వస్తున్న వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలను పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. స్థానికులు మాత్రమే ప్రకాశ్‌రెడ్డి వెంట ప్రచారం చేయాలని ఆంక్షలు విధించారు.