Home రాజకీయాలు .సర్కస్ ఫీట్లే బాలయ్యను మళ్లీ గెలిపిస్తాయా?

.సర్కస్ ఫీట్లే బాలయ్యను మళ్లీ గెలిపిస్తాయా?

SHARE

సినీనటుడు, అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ్యుడు చుట్టాలబ్బాయిగా మారాడని ఆ నియోజకవర్గ ప్రజలు విమర్శిస్తున్నారు. తనను గెలిపిస్తే స్థానికంగా ఉంటానని హామీ ఇచ్చి గెలిచాక సినిమా షూటింగుల్లో బిజీబిజీగా ఉంటూ చుట్టపుచూపుగా హిందూపురం వచ్చి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా పలు సమస్యలు ఉన్నాయని.. ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని వాపోతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే ఉంటే ఏమి? లేకుంటే ఏమి? అని బహిరంగంగా ఎదురుదాడికి దిగుతున్నారు. అంతేకాకుండా చుట్టపుచూపుగా వచ్చినపుడు కూడా సుడిగాలి పర్యటన, శిలాఫలకాల ఆవిష్కరణలు తప్ప సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ఆయన అంటే అదో టైపు..
బాలకృష్ణ.. సినీనటుడిగా.. ఎన్‌టీ రామారావు తనయుడిగా సుపరిచితుడు. అయితే అభిమానులు ఎవరైనా ఉత్సాహంగా సెల్ఫీ కోసం ప్రయత్నిస్తే సెల్‌ఫోన్‌ పగిలిపోతుంది. చెంప చెల్లుమంటుంది. ఇదీ ప్రస్తుత ట్రెండ్‌. పూలహారం వేస్తే విగ్గు పోతుందనే భయంలో మళ్లీ కొడుతాడు. ఆయన దగ్గరికి వెళ్తే దబిడి దిబిడే అని అభిమానులు నివ్వెరపోతున్నారు. ఆయన హిందూపురం వచ్చినప్పుడల్లా తలో దెబ్బ వేసినా… మా బాలయ్యే అంటూ బయట సర్దుకుపోతున్నా.. లోలోన కుమిలిపోతున్నారు. ఈసారి కూడా హిందూపురం టీడీపీ అభ్యర్థి ఆయనే. ఈ క్రమంలో ఈ సారి ప్రచారంలో ఇంకెంత మందిని కొడుతారో అని అభిమానులు భయంభయంగా ఉన్నారు.

నిజంగానే తేడాసింగ్‌
ఏపీలోని ఎమ్మెల్యేల్లో బాలకృష్ణది ప్రత్యేక స్థానం అని చెప్పవచ్చు. అన్ని నియోజక వర్గాలది ఒక తీరు.. హిందూపురం మరో తీరు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. బాలయ్య బాబు ఒక చిత్రంలో చెప్పిన విధంగానే.. చాలా తేడాసింగ్‌ అని హిందూపురం ప్రజలు విమర్శిస్తున్నారు. మిగతా ఎమ్మెల్యేల మాదిరి కాకుండా చాలా తేడాగానే వ్యవహరిస్తున్నారు. ఆయనకు నియోజకవర్గంతో పనిలేదు. ప్రజల బాగోగుల సంగతి మరిచారు. సినిమాలో అతిథి పాత్రలో వచ్చినట్లు హిందూపురం వచ్చి మీసాలు తిప్పి.. తొడలు కొట్టి.. శిలాఫలకాలు ఆరంభించి వెళ్లి పోతున్నారు.

పీఏ లదే పెత్తనం
బాలయ్యతో ఏ విషయం మాట్లాడాలన్నా ఆయన పీఏలను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలో హిందూపురంలో పీఏ లదే పెద్ద పెత్తనం. గత 2014 ఎన్నికల్లో బాలయ్య కుటుంబ సమేతంగా ప్రచారం చేస్తే 16,196 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే అప్పటి నుంచి ఆయన స్థానికంగా ఉన్న దాఖలాలు లేవు. వచ్చిన ప్రతిసారీ మూడు రోజులకు మించి ఉండరు. అద్దెకు తీసుకున్న ఇంటిని పీఏలకు అప్పగించి నియోజకవర్గాన్ని మరిచారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాకు చెందిన బాలయ్య పీఏ శేఖర్‌ ‘షాడో ఎమ్మెల్యే’ మాదిరిగా వ్యవహరించారనే విమర్శలు కూడా గతంలో తారస్థాయికి చేరాయి. ఫలితంగా ఆయనను తొలగించి గుంటూరు జిల్లా యడ్లపాడుకు చెందిన వీరయ్యను పీఏగా నియమించారు. ఇదే నియోజక వర్గానికి చెందిన తిమ్మాపురం మాజీ సర్పంచ్‌ శ్రీనివాసరావును మరో పీఏగా నియమించారు. చివరి రెండేళ్లు వీరే ఎమ్మెల్యే మాదిరిగా వ్యవహరించారని చెప్పవచ్చు.