Home రాజకీయాలు భయపడ్డాడు.. పవన్ కల్యాణ్ భయపడినట్టేనా!

భయపడ్డాడు.. పవన్ కల్యాణ్ భయపడినట్టేనా!

SHARE

ఒకటి కాదు రెండు చోట్ల పోటీ చేస్తారట.. జనసేన అధిపతి పవన్ కల్యాణ్. ఎమ్మెల్యేగా పోటీ విషయంలో పవన్ కల్యాణ్ తరఫున ఈ మేరకు ఆ పార్టీ ప్రకటన చేసేసింది. రాజకీయ పార్టీల అధినేతలు రెండు చోట్ల పోటీ చేయడం కొత్త కాదు. కొందరు సెంటిమెంటల్ గా పోటీ చేస్తూ ఉంటారు. కొందరు పార్టీకి ఊపురావడానికి రెండువేర్వేరు చోట్ల పోటీ చేస్తూ ఉంటారు. మరి కొందరు గెలుస్తామా.. ఓడతామా.. అనే భయంతో రెండు చోట్ల నామినేషన్లు వేస్తూ ఉంటారు. వీటిల్లో పవన్ కల్యాణ్ రెండు చోట్ల నామినేషన్ వేయడం ఏ కోవ కు చెందుతుందో ప్రజలే డిసైడ్ చేయాలి.

గత ఎన్నికల్లో మోడీ రెండు చోట్ల పోటీ చేశారు. అది సొంత రాష్ట్రం గుజరాత్ నుంచి మరో సీటు యూపీ నుంచి. మోడీ వేవ్ ఉందో లేదో తెలియని పరిస్థితుల్లో.. సేఫ్ సైడ్ కోసం ఆయన సొంత రాష్ట్రంలో కూడా నామినేషన్ వేసి ఉంచారు.

ఇక కేసీఆర్ కూడా ఇంతకు ముందు రెండు చోట్ల పోటీ చేసే వారు. అయితే అందులో ఒకటి ఎంపీ సీటు మరోటి ఎమ్మెల్యే సీటు. అది తన పార్టీకి ఊపు తెచ్చుకోవడం కోసం. అయితే ఇప్పుడు కేసీఆర్ ఆ రూటు మార్చారు. ఎమ్మెల్యేగా మొన్నటి ఎన్నికల్లో ఒక్క చోటే పోటీ చేశారు.ఇక ఎంపీగా ఇప్పుడు నామినేషన్ వేయడం లేదు.

ఇక ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి రెండు చోట్ల పోటీ చేశారు. అదే చిరంజీవిని కాపాడింది, చిరంజీవి పరువు తీసింది. రెండు చోట్ల పోటీ చేసిన చిరంజీవి సొంతూళ్లో ఓటమి పాలయ్యారు! ఏదో తిరుపతి ప్రజల దయ వల్ల చిరంజీవి ఎమ్మెల్యేగా నెగ్గారు. పరువు కాపాడుకున్నారు.

ఇక ఇప్పుడు మళ్లీ పవన్ కల్యాణ్ రెండు చోట్ల అంటున్నారు. ఇది కూడా సేఫ్టీ అనే తెలుస్తోంది. అసలుకు పవన్ పోటీ విషయంలో పార్టీ చాలా కసరత్తు చేసిందట. ఆయనకు సేఫ్ సైడ్ సీటు కోసం బోల్డంత అధ్యయనం చేశారట. ఇదంతా ఆ పార్టీ నే ప్రెస్ నోట్లో పేర్కొంది! ఇలా అసలు గుట్టును ఆ పార్టీనే బయటపెట్టుకుంది. పవన్ పోటీ కోసమే అంత గా కసరత్తు చేసుకోవాల్సి వచ్చిందనే విషయం అందరికీ అర్థమై పోయింది.

చిరంజీవిలా తను కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయే అవకాశాలున్నాయని పవన్ కు అర్థమైపోయిందని, అందుకే.. సేఫ్ సైడ్ గా రెండు చోట్ల నామినేషన్ వేశాడని స్పష్టం అవుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ పార్టీకి ఊపు తెచ్చేందుకు అయితే రాయలసీమలో ఒక నామినేషన్, ఆంధ్రాలో మరో నామినేషన్ వేయాల్సిందని, అలా కాకుండా.. పక్క పక్క నే పవన్ రెండు చోట్ల పోటీ చేస్తూ ఉండగటం.. గెలుపుపై ఆయనకున్న విశ్వాసాన్ని చాటుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.