Home రాజకీయాలు వివేకానందరెడ్డి హత్య.. వేలి ముద్రలు దొరికాయ్!

వివేకానందరెడ్డి హత్య.. వేలి ముద్రలు దొరికాయ్!

SHARE

మాజీ మంత్రి వివేకానందరెడ్డిది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. ఆ మేరకు కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వెల్లడించారు. వైఎస్ వివేకానందరెడ్డి శరీరంపై ఏడు చోట్ల బలమైన గాయాలను గుర్తించినట్టుగా ఆయన తెలిపారు. పోస్టు మార్గం నివేదిక ద్వారా ఇది హత్యేనని తేలిందని వివరించారు.

వివేకానందరెడ్డి తల మీద, ఛాతిపైన గాయాలున్నాయన్నారు. ఈ హత్యకు సంబంధించి తాము కొన్ని ఆధారాలను సేకరించినట్టుగా వివరించారు. ఘటనా స్థలంలో కొన్ని వేలి ముద్రలను సేకరించినట్టుగా తెలిపారు. అవి ఎవరివి అనేవి నిర్ధారించే పనిలో ఉన్నట్టుగా వివరించారు.

హత్య ఎవరి చేసి ఉండవచ్చు, ఎందుకు చేసి ఉండవచ్చనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకూ ఎవ్వరినీ అదుపులోకి తీసుకోలేదని.. కేసును విచారించి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఆయన వెల్లడించారు.

ఇక కడప జిల్లా, పులివెందుల ప్రాంత ప్రజల్లో వివేకానందరెడ్డి హత్యోదంతం సంచలనంగా మారింది. వివేకానందరెడ్డిని ఎవరు చంపి ఉంటారనే అంశం మీద చర్చ సాగుతూ ఉంది. ఈ సమయంలో ప్రజల నుంచి అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి.

అధికార పార్టీ మీద ఆరోపణలు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడి కనుసన్నల్లోనే వివేకానందరెడ్డి హత్య జరిగిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కడప జిల్లాలో రాజకీయ ఆధిపత్యం కోసం.. వివేకానందరెడ్డిని హత్య చేయించారు.. ఆయనను చంపితే రాజకీయంగా వైఎస్సార్సీపీని దెబ్బ తీసేందుకు వీలవుతుందని ప్రత్యర్థులు ఈ పని చేసి ఉంటారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.