Home రాజకీయాలు మంగళగిరి టీడీపీలో లొల్లి..!

మంగళగిరి టీడీపీలో లొల్లి..!

SHARE

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్‌ మరోసారి తప్పులో కాలేశారు. తెలుగుదేశం పార్టీ స్థాపించింది.. 1982లో అని అందరికీ తెలిసిన విషయమే. అయితే మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ గత 1980 నుంచి గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ గెలవలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలను కోరారు. ఆ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ నాయకులు లోకేశ్‌ మాటల్లోని తప్పును గ్రహించినా.. చెప్పలేకపోయారు.

మంగళగిరిలో 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయిన గంజి చిరంజీవిని ఓదార్చేందుకు మంత్రి లోకేశ్‌ మంగళగిరి వెళ్లారు. ఈసందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అంతేకాకుండా ఆది నుంచి మంగళగిరి టికెట్‌ బీసీలకు ఇస్తామని ప్రగల్బాలు పలికిన సీఎం చంద్రబాబునాయుడు ఇప్పుడు.. ఆయన కుమారుడికి ఇవ్వడంపై బీసీ సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇలాంటి నిర్ణయాలతోనే పార్టీ నష్టపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.

మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం లోకేష్‌ను ప్రకటించడంతో అప్పటివరకు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న పలువురు నాయకులు అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన టీడీపీ నాయకుడు గంజి చిరంజీవి ఇంటికి మంత్రి లోకేశ్‌ చేరుకుని ఆయనతో ఏకాంతంగా మాట్లాడారు. తమ పార్టీ అధినేత ఆదేశంతో పోటీ చేస్తున్నానని, చిరంజీవి రాజకీయ భవిష్యత్తును పార్టీ చూసుకుంటుందని భరోసా ఇచ్చారు.

అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు, మాజీ ఇన్‌చార్జి పోతినేని శ్రీనివాసరావు ఇళ్లకు వెళ్లి వారిని బుజ్జగించే యత్నం చేశారు. అయితే తమ సామాజిక వర్గానికి రాష్ట్రంలో ఎక్కడా టీడీపీ సీటు కేటాయించకపోవడంతో మంగళగిరి పట్టణానికి చెందిన పద్మశాలీయ సామాజిక వర్గం వారు శుక్రవారం తమ వ్యాపార సముదాయాల బంద్‌కు పిలుపునిచ్చారు.