Home రాజకీయాలు వైఎస్ కుటుంబానికి షాక్.. మరో హత్య ఇది

వైఎస్ కుటుంబానికి షాక్.. మరో హత్య ఇది

SHARE

గుండెపోటుతో మరణించారని అనుకున్న వైఎస్ వివేకానందరెడ్డిది అనుమానాస్పద మరణంగా మారింది. ఆయన దారుణంగా హత్యకు గురి అయ్యారు అనే విషయం స్పష్టం అయ్యింది. వివేకానందరెడ్డి మరణించారనే వార్త ఈ రోజు ఉదయమే సంచలనం రేపింది. నిన్నంతా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాత్రి ఒంటరిగా ఇంట్లో ఉండగా.. ఉదయాన్నే మరణ వార్త వెలుగులోకి వచ్చింది.

మొదట గుండెపోటు అని అనుకున్నా.. చివరకు ఆయన శరీరంపై గాయాలను బట్టి ఆయనది హత్య అని పోస్టుమార్టం నివేదిక తేల్చిందని సమాచారం. వైఎస్ కుటుంబీకుల్లో హత్యకు గురి అయిన వారిలో రెండో వ్యక్తి వివేకానందరెడ్డి. వైఎస్ వివేక తండ్రి, వైఎస్ రాజారెడ్డి కూడా దారుణంగా హత్యకు గురి అయిన సంగతి తెలిసిందే. దశాబ్దాల కిందట ఆ హత్య జరిగింది.

రాజారెడ్డి జీపులో వెళ్తుండగా.. దారిలో అగంతకులు అటకాయించి ఆయన పై దాడికి పాల్పడ్డారు. బాంబులు విసిరి, వేట కొడవళ్లతో ఆయనను నరికి చంపారు. వివేకానందరెడ్డి శరీరంపై కూడా గాయాల గుర్తులను బట్టి.. ఆయననూ నరికి చంపారనే అభిప్రాయాలే వినిపిస్తూ ఉన్నాయి. హత్య అని మాత్రం ప్రాథమికంగా నిర్ధారించారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించి పది సంవత్సరాలు అవుతూ ఉన్నాయి. వైఎస్ హెలి కాప్టర్ ప్రమాదంలో మరణించారు. అదీ అనుమానాస్పదంగా నిలిచింది చాలా కాలం పాటు. ఇప్పుడు వివేకానందరెడ్డి హత్య జరిగింది. ఫ్యాక్షన్ రాజకీయమే వివేకానందరెడ్డిని బలి తీసుకుందనే ప్రచారం సాగుతోంది కడప జిల్లాలో. జమ్మలమడుగుకు సంబంధించిన నేతలపై సామాన్య ప్రజల నుంచి గట్టిగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి స్థానికంగా.