Home ప్రత్యేకం ఎన్నికల హీట్.. జగన్ ప్లాన్ ఇదే!

ఎన్నికల హీట్.. జగన్ ప్లాన్ ఇదే!

SHARE

ఈ నెల పదహారో తేదీన ఒకే దెబ్బలో అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల జాబితానూ ప్రకటించేయాలనేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆలోచన అని స్పష్టం అవుతోంది. విడతల వారీగా కాకుండా.. ఒకే రోజు ఇడుపులపాయ వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాబితాను జగన్ ప్రకటించబోతున్నారని ఆ పార్టీ ప్రకటించేసింది. ఇప్పటికే చాలా వరకూ జగన్ కసరత్తు పూర్తి అయ్యింది. మరి కొన్ని స్థానాల విషయంలో మాత్రమే తర్జనభర్జనలు ఉన్నాయి.

అలాంటివి కూడా ఇప్పటికే కొన్ని తెగిపోయినట్టే అని, ఈ రోజు మొత్తం కథ అయిపోతుందని.. రేపటితో పూర్తి స్పష్టత వస్తుందని.. శనివారం రోజున జగన్ మొత్తం అభ్యర్థుల జాబితాను అనౌన్స్ చేస్తారని.. సోమవారం నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్న నేపథ్యంలో శనివారమే అభ్యర్థుల ప్రకటన చేయనున్నారట జగన్ మోహన్ రెడ్డి.

ఇక ప్రచారం విషయంలో కూడా జగన్ ప్లాన్ వెల్లడి అయ్యింది. ప్రధానంగా పాదయాత్రతో కవర్ కాని నియోజకవర్గాలను జగన్ టార్గెట్ గా చేసుకోనున్నారని సమాచారం.

ఇడుపుల పాయలో అభ్యర్థుల జాబితాను ప్రకటించి.. ఆ వెంటనే జగన్ గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు వెళ్తారని.. అక్కడ మొదటి బహిరంగ సభలో జగన్ పాల్గొంటారని తెలుస్తోంది. ప్రచారం జరిగినన్ని రోజులూ.. జగన్ రోజుకు మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తారని సమాచారం. నామినేషన్ల వరకూ రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పునా.. ఇరవై ఐదో తేదీతో నామినేషన్ల పర్వం ముగిశాకా.. రోజుకు నాలుగు నియోజకవర్గాల్లో జగన్ పర్యటనలు ఉండబోతున్నాయని సమాచారం.

ఇక జగన్ కవర్ చేయని నియోజకవర్గాలను… ఆయన తల్లి విజయమ్మ, షర్మిలలు బాధ్యతగా తీసుకోనున్నారని తెలుస్తోంది. వారు కూడా పలు నియోజకవర్గాలు తిరిగి పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది.

ఈ విధంగా వైఎస్ కుటుంబీకులు ముగ్గురూ..మొత్తం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రచార పర్వాన్ని కవర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.