Home రాజకీయాలు ఆఖరి నిమిషంలో.. చంద్రబాబు అభ్యర్థుల వేట!

ఆఖరి నిమిషంలో.. చంద్రబాబు అభ్యర్థుల వేట!

SHARE

గత ఐదేళ్లలో వచ్చేందుకు రెడీ అయిన ప్రతి నేతనూ తెలుగుదేశం పార్టీ చేర్చేసుకుంది! ఒకరిని కాదు.. ఇద్దరిని కాదు.. ఏకంగా పాతిక మంది ఎమ్మెల్యేలను ప్రతిపక్ష పార్టీ నుంచి చేర్చుకుంది తెలుగుదేశం పార్టీ. ఇక కాంగ్రెస్ పార్టీలోనూ నేతలను మిగలనీయలేదు తెలుగుదేశం పార్టీ. అనేక మందిని చంద్రబాబు నాయుడు చేర్చేసుకున్నాడు. అయినా తీరా ఎన్నికల సమయం ఆసన్నం అయ్యాకా.. తెలుగుదేశం పార్టీకి అభ్యర్థుల కొరత వస్తూ ఉండటం విశేషం!

పలు ఎంపీ సీట్ల విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత అభ్యర్థులను వెదుకుతూ ఉంది ! ఆఖరి నిమిషంలో కూడా చంద్రబాబు నాయుడు అభ్యర్థులను అన్వేషిస్తూ ఉన్నారు. సోమవారం నుంచి నామినేషన్లు దాఖలు చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరకపోవడం.. ఎవరు దొరుకుతారా.. అని చంద్రబాబు నాయుడు అన్వేషిస్తూ ఉండటం ఆసక్తిదాయకంగా మారింది.

ఒంగోలు, నెల్లూరు వంటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల నియోజకవర్గాలతో పాటు… విశాఖ, రాజమండ్రి వంటి ఎంపీ సీట్ల విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను రెడీ చేసుకోలేకపోవడం విశేషం. వీటి విషయంలో అభ్యర్థుల పేర్లు మారుతూనే ఉన్నాయి. మొదట ఒకరి పేరును తెర మీదకు తేవడం, ఆ తర్వాత.. మరొకరి పేరును తెర మీదకు తీసుకురావడం.. జరుగుతూ ఉంది.

ముందుగా చంద్రబాబు నాయుడు ఓకే అనుకున్న నేతలు పోటీకి వెనుకడుగు వేస్తూ ఉన్నారు. పోటీకి రెడీ అంటున్న వారు కొంతమంది ఉన్నా.. వారు గెలవలేరు అని చంద్రబాబు నాయుడే ఒక అభిప్రాయానికి వచ్చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది.

కేవలం ఎంపీ టికెట్ల విషయంలోనే కాదు.. ఎమ్మెల్యే టికెట్ల విషయంలో కూడా చంద్రబాబు నాయుడుకు కొన్ని నియోజకవర్గాలు చుక్కలు చూపిస్తున్నాయనే టాక్ నడుస్తోంది. కనీసం పాతిక ఎమ్మెల్యే సీట్ల విషయంలో ఇప్పుడు అభ్యర్థుల విషయంలో బాబు తర్జనభర్జనలు పడుతూ ఉన్నారని సమాచారం అందుతోంది!