Home రాజకీయాలు లోకేష్ పోటీ.. అక్కడ నుంచి కాదు ఇక్కడ.. కాదు!

లోకేష్ పోటీ.. అక్కడ నుంచి కాదు ఇక్కడ.. కాదు!

SHARE

ఏపీ మంత్రి నారా లోకేష్ బాబు ప్రత్యక్ష ఎన్నికల పోరాటం ఎక్కడ నుంచి అనేది మిస్టరీగా కొనసాగుతూ ఉంది. లోకేష్ ను ఎక్కడ నుంచి పోటీ చేయించాలనే అంశం గురించి తెలుగుదేశం పార్టీ అధినేత ఎంతగా కసరత్తు చేస్తున్నారో చెప్పనక్కర్లేదు. తనయుడిని పోటీ చేయించేందుకు చంద్రబాబు నాయుడు సురక్షిత స్థానాలను వెదుకుతూ ఉన్నారు. అందుకు సంబంధించి చాన్నాళ్లుగా సర్వేలు గట్రా చేయిస్తూ ఉన్నారు.

అయితే.. ఆ వ్యవహారం ఎంతకూ తెగడం లేదు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో… లోకేష్ పోటీ విషయంలో వివిధ నియోజకవర్గాల పేర్లను లీకులుగా ఇస్తూ ఉన్నారు. ఈ విషయంలో రెండు మూడు రోజుల కిందట భీమిలి నియోజకవర్గం పేరును లీకుగా ఇచ్చారు.

లోకేష్ భీమిలి నుంచి పోటీ చేయబోతున్నారని ప్రకటించారు. ఆ మేరకు అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించారు. అయితే రెండో రోజే ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ వెనుకడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. లోకేష్ భీమిలి నుంచి పోటీ చేయడం లేదు.. అనేది తాజా సమాచారం!

లోకేష్ ను విశాఖ నార్త్ నుంచి పోటీ చేయించాలని అనుకుంటున్నాడట తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. లోకేష్ విషయంలో విశాఖ నార్త్ సీటు ఖరారు అయ్యిందని అంటున్నారు. అయితే అది నిజంగానేనా? నిజంగా లోకేష్ అక్కడ నుంచి పోటీ చేస్తారా? అంటే మాత్రం.. కచ్చితంగా ఔను అని చెప్పలేని పరిస్థితి.

ప్రస్తుతానికి ఇది కూడా లీక్ మాత్రమే! విశాఖ నార్త్ అనేది తాజా లీక్ మాత్రమే. అక్కడ నుంచి పోటీ చేస్తారనే నమ్మకాలు ఏవీ లేవు. నామినేషన్ వేసేంత వరకూ లోకేష్ విషయంలో ఇవన్నీ లీకులు మాత్రమే. చివరకు లోకేష్ ఎక్కడా పోటీ చేయకపోయినా.. నెగ్గే పరిస్థితి లేకపోవడంతో.. పూర్తిగా తప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని పరిశీలకులు అంటున్నారు.