Home రాజకీయాలు వారం రోజులే.. జనసేన పరిస్థితి ఎలా ఉంది?

వారం రోజులే.. జనసేన పరిస్థితి ఎలా ఉంది?

SHARE

మళ్లీ సోమవారం నుంచి ఏపీలో నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. నామినేషన్లకు మరో వారం వ్యవధి ఉంది, అవి మొదలయ్యాకా మరో వారంలో ఏ కథా తేలిపోవాల్సి ఉంది. ఇలాంటి నేపథ్యంలో పవన్ కల్యాణ్ పార్టీ జనసేన కథేంటి.. అని ఆరా తీస్తే.. ఆ పార్టీ కథేంటో ఎవరికీ అంతుబట్టకుండా ఉంది.

ఇప్పటికే ఆశావహుల నుంచి అప్లికేషన్లు అయితే తీసుకున్నారు. అందుకు సంబంధించి దరఖాస్తు గడువు కూడా ముగిసింది. ఆశావహులంతా అప్లికేషన్లు దాఖలు చేసినట్టే. దాదాపు పద్నాలుగు వందల అప్లికేషన్లు వచ్చాయట. మరి.. వాటిల్లో పవన్ కల్యాణ్.. ఎవరిని అభ్యర్థులుగా ఎంపిక చేశారో ఇంకా తెలియదు!

అలాగే కమ్యూనిస్టు పార్టీలతో జనసేన పొత్తు వ్యవహారం కూడా ఇంకా ఒక కొలిక్కి వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. కమ్యూనిస్టు పార్టీలకు ఏ టికెట్లు కేటాయిస్తారనే అంశంపై క్లారిటీనే ఇవ్వకుండా జనసేన అధిపతి.. తన వాళ్ల నుంచి అప్లికేషన్లు తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో.. వారికి ఏ సీట్లను ఇస్తారో ఎవరికీ తెలియదు. ఉన్న టైమ్ చూస్తే మరో వారం రోజులు మాత్రమే. ఇలాంటి నేపథ్యంలో పవన్ కల్యాణ్ అభ్యర్థుల ప్రకటనను ఎప్పుడు చేయబోతున్నారు? ఎలాగూ ఒక్కో నియోజకవర్గంలో ఒకరికి మించి దరఖాస్తులు చేసుకున్నారు. మరి వారిలో ఒకరికి ఇస్తే మరొకరు ఊరికే ఉంటారా? అనే విషయాలు చర్చనీయాంశాలు అవుతున్నాయి.

మరో విషయం ఏమిటంటే..ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నాడనే అంశం మీద కూడా స్పష్టత లేదు. అసలు పవన్ పోటీ చేస్తాడా? పోటీ నుంచి తప్పుకుంటాడా.. కేవలం ప్రచారం మాత్రమే అంటాడా.. అనే అంశాలపై ఈ వారంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.