Home రాజకీయాలు నెల రోజుల్లో పోలింగ్.. తెలుగుదేశంలో గందరగోళం!

నెల రోజుల్లో పోలింగ్.. తెలుగుదేశంలో గందరగోళం!

SHARE

మొన్నటి వరకూ ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయా..అని ఆత్రుత పడిన వారు కూడా, ఇప్పుడు ఆశ్చర్యంలో ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల లేట్ అవుతోందని.. వ్యాఖ్యానించిన వారు కూడా సరిగ్గా నెల రోజుల్లో పోలింగ్ అంటే.. అప్పుడేనా అంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ, తెలంగాణల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ను తొలి దశలోనే అని ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

మరో వారం రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో.. పార్టీలు అభ్యర్థుల విషయంలో ఇప్పుడు ఎటు తిరిగీ తేల్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో ఏపీలో ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే.. ఆందోళన తెలుగుదేశంలో మాత్రమే అని స్పష్టం అవుతోంది.

అభ్యర్థిత్వాల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా వరకూ స్పష్టత తెచ్చుకుంది. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరుముగ్గురు నేతలను ఎంకరేజ్ చేయడం లేదు జగన్ మోహన్ రెడ్డి. కొన్ని చోట్ల ఇన్ చార్జిలను మార్చారు కానీ.. అభ్యర్థిత్వాల విషయంలో ఎవరికి చాన్సులుంటాయో తేల్చేశారు.

అయితే చంద్రబాబు రాజకీయం అలా లేదు. ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు నేతలను ఎంకరేజ్ చేయడం.. వారిలో ఎవరికి టికెట్ అనే అంశంలో తేల్చకపోవడం చంద్రబాబు ప్రత్యేకత. ఇప్పటి వరకూ అలాంటి ప్రతిష్టంభన నెలకొన్న నియోజకవర్గాలే చాలా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో వచ్చే సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. కేవలం వారం వ్యవధి మాత్రమే ఉంది.

ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఇంకా చాలా నియోజకవర్గాల పంచాయతీలు తేల్చాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వారం రోజుల్లో నామినేషన్లు అంటే.. తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన గందరగోళమే ఏర్పడుతోంది!