Home రాజకీయాలు జగన్ పై దాడి కేసులో చంద్రబాబు ప్రమేయముంది కనుకనే భయం: కన్నా

జగన్ పై దాడి కేసులో చంద్రబాబు ప్రమేయముంది కనుకనే భయం: కన్నా

SHARE

వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడిలో చంద్రబాబు ప్రమేయం ఉంది కనుకనే ఆయన భయపడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ కేసులో ఎన్ఐఏ ఎందుకు కల్పించుకుంటోందని ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ రాశారని విమర్శించారు.

జగన్ పై దాడి జరిగింది ఎయిర్ పోర్టులో కనుక కేంద్రానికే తప్ప తమకేమీ సంబంధం లేదని చంద్రబాబు అన్నారని, ఇప్పుడేమో, కేంద్ర ప్రభుత్వం ఎంక్వయిరీ చేస్తామంటే ఆయన ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించిన సమాచారమివ్వనని, ఎన్ఐఏ ఎవరని, ఈ కేసుకు ఎన్ఐఏకు ఏంటి సంబంధమని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారని విమర్శించారు. దీనిని బట్టి ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను అవినీతి పేరుతో చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు దోచుకున్నారని ఆరోపించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధే దేశాభివృద్ధి గా భావించి పథకాల కేటాయింపుల్లో నరేంద్ర మోదీ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

నరేంద్ర మోదీ మరో సారి ప్రధానమంత్రి అవడం దేశానికి అవసరమని చెప్పారు. అరాచక శక్తుల నుంచి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు.