Home సినిమా ‘ఎఫ్‌ 2’ మూవీ రివ్యూ

‘ఎఫ్‌ 2’ మూవీ రివ్యూ

SHARE

టైటిల్ : ఎఫ్‌ 2 (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌)
జానర్ : కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహరీన్‌, రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌, ప్రగతి
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్‌
దర్శకత్వం : అనిల్‌ రావిపూడి
నిర్మాత : దిల్‌ రాజు
రేటింగ్ : 3.0 / 5 

సంక్రాంతి సినిమాల్లో ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా కాస్త ప్రత్యేకంగా నిలిచిన ఎఫ్2 వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఆసక్తిని రేపింది. చాలా రోజుల తర్వాత వెంకీ తనదైన ట్రేడ్ మార్క్ ఫన్ రోల్ లో కనిపించినట్టు ట్రైలర్ లో చూపడంతో ఫ్యాన్స్ గట్టి నమ్మకమే పెట్టుకున్నారు.

కామెడి మిస్ చేయకుండా మసాలా అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఓ బ్రాండ్ సృష్టించుకున్న అనిల్ రావిపూడి మీద నమ్మకం కూడా దీనికి ప్లస్ అయ్యింది. ఇప్పటిదాకా వచ్చిన మూడు పండగ సినిమాల్లో ఏదీ యూనానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోలేకపోవడంతో ట్రేడ్ చూపంతా ఎఫ్2 మీదే ఉంది. మరి వీటిని అందుకునేలా ఇది మెప్పించిందా లేదా రివ్యూ లో చూసేద్దాం

కథ 

ఎమ్మెల్యే(రఘుబాబు)దగ్గర పిఏగా పనిచేసే వెంకీ(వెంకటేష్)కు మ్యాట్రిమోనీ ద్వారా హారిక(తమన్నా)తో పెళ్లవుతుంది. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత హారికతో పాటు తన ఫ్యామిలీ నుంచి కూడా చిక్కులు వస్తాయి . దాంతో ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. మరోవైపు హారిక చెల్లెలు హనీ(మెహ్రీన్)ని ప్రేమించిన వరుణ్(వరుణ్ తేజ్)అచ్చం వెంకీ తరహాలోనే ఇదే ట్రాప్ లో పడతాడు. అయితే పెళ్ళయ్యాక  తన లైఫ్ కూడా వెంకీలాగా మారిపోతుందేమో అని భయపడ్డ వరుణ్ పెళ్లి టైంకి మాయం అయిపోతాడు.

కట్ చేస్తే ఇద్దరు పెళ్లాలతో విసిగిపోయిన పక్కింటాయన (రాజేంద్రప్రసాద్) సలహాతో ముగ్గురు యూరోప్ లో ప్రత్యక్షమవుతారు. వీళ్ళు ఏమయ్యారో అని టెన్షన్ పడుతున్న అక్కాచెల్లెళ్లు యూరప్ లో సెటిల్ అయిన నాన్న ఫ్రెండ్ దొరైస్వామినాయుడు(ప్రకాష్ రాజ్)సహాయంతో అక్కడ ఎంట్రీ ఇస్తారు. వీళ్ళ రాక ఊహించని వెంకీ,వరుణ్ లకు అక్కడో కొత్త సమస్య మొదలవుతుంది. అసలు ఈ జంటల కథ ఎక్కడిదాకా వెళ్ళింది, తిరిగి ఎలా కలుసుకున్నారు అనేదే ఎఫ్2  బ్యాలన్స్.

నటీనటులు 

చాలా కాలం తరువాత వెంకటేష్‌ తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. సినిమా అంతా తన భుజాల మీదే నడిపించాడు. పర్ఫామెన్స్‌, డైలాగ్‌ డెలివరీ, కామెడీ ఇలా ప్రతీ దాంట్లో వెంకీ పర్ఫామెన్స్‌ సూపర్బ్‌ అనేలా ఉంది. మరో హీరోగా నటించిన వరుణ్ తేజ్‌ కూడా మంచి నటనతో ఆకట్టుకున్నాడు. నటన పరంగా మెప్పించినా.. తెలంగాణ యాసలో మాట్లాడేందుకు కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపించింది.  కామెడీ పరంగా మాత్రం మంచి మార్కులే సాధించాడు. హారిక పాత్రలో తమన్నా ఆకట్టుకుంది. చాలా రోజుల తరువాత లీడ్ హీరోయిన్‌గా అలరించింది. ఫస్ట్ హాఫ్‌లో మరో హీరోయిన్‌మెహరీన్‌ నటన కాస్త అతిగా అనిపించినా తరువాత తరువాత పరవాలేదనిపిస్తుంది. గ్లామర్‌ షోలో మాత్రం ఇద్దరు హీరోయిన్లు ఒకరితో ఒకరు పోటి పడ్డారు. ఇతర పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌, ప్రగతి, ప్రియదర్శి, వెన్నెల కిశోర్‌లు తమ వంతుగా నవ్వించే ప్రయత్నం చేశారు.

సాంకేతిక వర్గం 

దర్శకుడు అనిల్ రావిపూడికి ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్ కామెడీ సెన్స్. ఇప్పటి తరం దర్శకుల్లో ఎవరికీ లేని హాస్య చతురత ఇతనిలో పుష్కలంగా ఉంది. ఇంతకు ముందు తీసిన మూడు సినిమాలు మాస్ జానర్ వే అయినప్పటికీ వాటిలో కూడా మంచి ఫన్ ఉంటుంది. ఓ రెండు డబుల్ మీనింగ్ డైలాగ్స్ మినహాయిస్తే ఎక్కడా అసభ్యత లేకుండా క్లీన్ కామెడీతో నడిపించిన తీరు ఇంటర్వెల్ దాకా ఆపకుండా నవ్విస్తుంది.

వెంకటేష్ ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్న సన్నివేశాలు సంభాషణలు బ్రహ్మాండంగా పండాయి. చాలా సింపుల్ గా అనిపించే ఎపిసోడ్స్ ని హిలేరియస్ గా తీర్చిదిద్దిన అనిల్ పనితనం మెచ్చుకోవలసిందే. అయితే ఫస్ట్ హాఫ్ దాకా బిగిసడలని కామెడీ టెంపోతో సాఫీగా నడిపించేసిన అనిల్ రెండో భాగం మొదలయ్యేసరికి తడబడ్డాడు. రెండున్నర గంటల పాటు ఎంగేజ్ చేసే స్టఫ్ ఈ థీమ్ లో లేకపోవడంతో పూర్తిగా ఇన్ హౌస్ కామెడీ మీద ఆధారపడి పోయి ప్రకాష్ రాజ్ ఇంట్లోనే మొత్తం నడిపించే సాహసం చేసాడు. అది కొంత నిరాశ పరిచినప్పటికీ ప్రతికూల ఫలితం అయితే ఇవ్వలేదు.

వరుణ్ పాత్ర పెళ్లి పందిరి నుంచి అలా హఠాత్తుగా వెంకీ రాజేంద్రప్రసాద్ లతో కలిసి వెళ్లిపోవడం అసహజంగా ఉన్నా యూరప్ లో జరిగే ప్రహసనం అంతా సాగదీసినట్టు అనిపిస్తుంది. అక్కడక్కడా వెంకీ వరుణ్ లు తమ ప్రెజెన్స్ తో గట్టిగానే కాపాడే ప్రయత్నం చేసారు. కొన్ని సీన్స్ మంచి ఫన్ తోనే నడిచాయి. అయితే ఫస్ట్ హాఫ్ చూసి ఇంటర్వల్ లో  బయటికి వచ్చాక అదే స్థాయిలోనో లేదా అంతకు మించి సెకండ్ హాఫ్ లో ఎంటర్ టైన్మెంట్ ఆశిస్తాం కాబట్టి దానికి అనుగుణంగా మిగిలిన కథ లేకపోవడంతో చక్కగా తింటున్న రుచుకరమైన భోజనం ప్లేట్ లో సడన్ గా మంచి నీళ్లు పోసినట్టు అనిపిస్తుంది.

దేవిశ్రీప్రసాద్ తన స్థాయికి ఏ మాత్రం తగని సంగీతం ఇచ్చాడు. ఒక్కటంటే ఒక్కపాట వినేలా కాదు కదా కనీసం చూసేందుకు కూడా ఇష్టం కలిగించలేదు. ఒకవేళ మంచి మ్యూజిక్ పడి ఉంటె చాలా లోపాలు వీటి రూపంలో కవర్ అయిపోయేవి, కానీ ఆ ఛాన్స్ మిస్ అయ్యింది. సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం కలర్ ఫుల్ గా ఉంది. విజువల్స్ బాగా ప్రెజెంట్ చేసారు. ఛాలెంజ్ అనిపించే సబ్జెక్టు కాదు కాబట్టి ఆయన పని తేలికైంది. తమ్మిరాజు ఎడిటింగ్ నీట్ గా ఉంది. కొంచెం బోర్ ఉన్నా అది స్క్రిప్ట్ లోపమే కానీ మరొకటి కాదు. దిల్ రాజు ప్రొడక్షన్ యధావిధిగా ఆయన స్టాండర్డ్ లో ఉంది

పాజిటివ్ పాయింట్స్ 

వెంకీ సూపర్బ్ కామెడీ

కాన్సెప్ట్

ఫస్ట్ హాఫ్

ఆర్టిస్ట్ సెలక్షన్

నెగటివ్ పాయింట్స్ 

సెకండ్ హాఫ్

దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్

ద్వితీయార్థంలో కొన్ని సీన్స్‌

విశ్లేష‌ణ‌ 

వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న అనిల్‌ రావిపూడి ఈ పండక్కి ఓ మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కథగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోయినా కట్టిపడేసే సన్నివేశాలతో కడుపుబ్బా నవ్వించాడు. ప్రతీ ఇంట్లో రెగ్యులర్‌గా జరిగే సన్నివేశాలనుంచే కామెడీ జనరేట్‌ చేశాడు. భార్య భర్తల మధ్య జరిగే గొడవలు, వాటి పరిణామాలు, పుట్టింటి వారి మాటలు ఇలా ప్రతీది ఎంతో ఫన్‌ క్రియేట్ చేసింది. రచయితగానూ అనిల్ రావిపూడి ఫుల్‌ మార్క్‌ సాదించాడు. అనిల్ రాసిన డైలాగ్స్‌ చాలా బాగున్నాయి. తొలి భాగాన్ని ఏమాత్రం పట్టు తప్పకుండా ఫన్‌ రైడ్‌లా నడిపించిన దర్శకుడు ద్వితియార్థంలో కాస్త నెమ్మదించాడు. క్లైమాక్స్‌లో నాజర్‌ ఎంట్రీ, ఆయన చెప్పే డైలాగ్స్‌ ఆలోచింప చేస్తాయి. దేవీ శ్రీ ప్రసాద్‌ అందించిన పాటలు పరవాలేదనిపిస్తాయి. నేపథ్య సంగీతం బాగుంది. సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్‌ లుక్‌ తీసుకువచ్చింది. ముఖ్యంగా యూరప్‌ అందాలను చాలా బాగా తెర మీద ఆవిష్కరించారు. ఎడిటింగ్‌,నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.