Home సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు రివ్యూ

ఎన్టీఆర్ కథానాయకుడు రివ్యూ

SHARE
నందమూరి అభిమానుల్లోనే కాక సాధారణ ప్రేక్షకుల్లో సైతం ఆసక్తి రేపిన ఎన్టీఆర్ బయోపిక్. నందమూరి నటవారసుడు బాలకృష్ణ స్వయంగా దీన్ని నిర్మించి నటించడంతో సహజంగానే అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు క్రిష్ దర్శకత్వం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరి సంక్రాంతి పండగలో తొలి అడుగు వేసిన కథానాయకుడు ఆశించినట్టే ఉన్నాడా లేదా రివ్యూలో చూద్దాం పదండి
కథ 
నిమ్మకూరు అనే చిన్న ఊరి నుంచి వచ్చి పట్టభద్రుడైన నందమూరి తారకరామారావు(బాలకృష్ణ)బెజవాడ రిజిస్టర్ ఆఫీస్ లో ఉద్యోగిగా చేరతాడు. అక్కడ లంచాల వ్యవస్థను భరించలేక రాజీనామా చేసి దర్శకుడు ఎల్వి ప్రసాద్(జీస్సు సేన్ గుప్తా) అంతకు ముందు పంపిన లెటర్ తీసుకుని సినిమాల్లో హీరోగా నటించేందుకు మదరాసు బయలుదేరతాడు. అతనికి గర్భిణీగా ఉన్న భార్య బసవతారకం(విద్య బాలన్)మద్దతు పలుకుతుంది. అలా అవకాశాల కోసం మదరాసు వచ్చిన రామారావుకు మొదట్లో చేదు అనుభవాలు ఎదురైనా విజయ వాహిని అధినేతలు నాగిరెడ్డి,చక్రపాణి(ప్రకాష్ రాజ్-మురళీశర్మ)సహాయంతో నిలదొక్కుకుంటాడు. స్టార్ గా తెరవేల్పుగా ఎదుగుతాడు.
రామారావు నట ప్రస్థానంలో అతని తమ్ముడు త్రివిక్రమరావు(దగ్గుబాటి రాజా)పాత్ర చాలా ఉంటుంది. అయితే కెరీర్ ఉచ్చ దశకు చేరుకున్నాక రామారావుకు ప్రజా సేవ చేయాలన్న కాంక్ష మొదలవుతుంది. దీంతో రాజకీయాలలోకి రావాలని నిర్ణయించుకుంటాడు. కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన నాదెండ్ల భాస్కర్ రావు(సచిన్ కెద్కర్)సహాయంతో తెలుగుదేశం పార్టీని ప్రకటిస్తాడు. మహానాయకుడులో మిగిలిన భాగం చూడమని ఎండ్ టైటిల్స్ వేస్తాడు
నటీనటులు 
వంద సినిమాల అనుభవం ఉన్న నటుడిగా బాలకృష్ణకు కొత్తగా ఎవరూ సర్టిఫికెట్ ఇవ్వనవసరం లేదు. బయట వ్యవహారికంలో ఎలా మాట్లాడినా కెమెరా ముందుకు వచ్చేసరికి మనకున్న బెస్ట్ యాక్టర్స్ లో బాలయ్య స్థానం చాలా ప్రత్యేకం. ఇందులోనూ అదే కొనసాగించారు. కాకపొతే ఎన్టీఆర్ కన్నా ఎక్కువగా మనకు తెరమీద బాలకృష్ణే కనిపించడం బహుశా ఎన్టీఆర్ అనే తెరవేల్పుకి మన కళ్ళు అంత బలంగా ప్రభావితం చెందటం కావొచ్చు. అయినా కూడా బాలయ్య వెండితెర వెలుగుకిరణంలా చక్కగా పరకాయప్రవేశం చేసాడు.
ముఖ్యంగా ఎన్టీఆర్ పాత గెటప్స్ లో స్టెప్పులు బయటం, గెటప్పుల్లో సందడి చేయడం వగైరా నందమూరి అభిమానులను ఆనందంలో ఉక్కిరిబిక్కిరి చేసేవే. కాకపోతే ఎన్టీఆర్ ఆహార్యాన్ని కాకుండా బాలయ్య తన మాములు శారీరక భాషనే చూపించడంతో ప్రత్యేకమైన సినిమా చూస్తున్న ఫీలింగ్ మిస్ అవుతుంది. దానికి తోడు వయసు మీద పడిన ప్రభావం మొహం మీద స్పష్టంగా కనిపిస్తుండటం ఫ్యాన్స్ కేమో కానీ సాధారణ ప్రేక్షకులకు ఇబ్బందిగా అనిపిస్తుంది.  అయినప్పటికి లేట్ ఏజ్ లో మహానటి స్ఫూర్తితో బాలయ్య చేసిన ఈ సాహసం ఎంతైనా అభినందనీయం.
బసవతారకంగా విద్యా బాలన్ పర్ఫెక్ట్ ఛాయిస్. చాలా హోమ్లీగా పద్దతిగా ఉండటం బాగుంది. బొద్దుగా ఉండటం ప్లస్ అయ్యింది. ఎమోషన్స్ ని బాగా పండించింది. ఇక ఈ ఇద్దరు కాకుండా ఎవరి పాత్రా ఎక్కువ స్పాన్ ఉన్నది కాదు. అయినా అందరి ఉనికి ప్రేక్షకులకు తెలుస్తూనే ఉంటుంది. ఏఎన్ఆర్ గా సుమంత్ అలా ఒదిగిపోయాడు. రెండు మూడు సన్నివేశాల్లో ఆయన్ని గుర్తు చేస్తాడు కూడా. చాలా కాలం క్రితమే తెరకు దూరమైన దగ్గుబాటి రాజా బాలయ్యతో సమానంగా సినిమా మొత్తం ఉండే పాత్రలో బాగా మెప్పించాడు.
వీళ్ళు కాకుండా అందరివీ చిన్న పాత్రలే. ప్రకాష్ రాజ్, క్రిష్ లవి మహానటి పాత్రలకు కొనసాగింపు అంతే. గుర్తుంచుకుని చెప్పుకునే స్థాయిలో ఎవరివి లేదు. కుర్ర హీరోయిన్లను కేవలం అర నిమిషం కోసం మాత్రమే కనిపించే బిట్ సాంగ్స్ కోసం వాడుకున్నారు. కళ్యాణ్ రామ్ కొంత వరకు నయం. అక్కడక్కడా అలా కనిపించి ఇలా మాయం అవుతాడు. శాలిని పాండే, ప్రణీత, రకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మానందం, హన్సిక, పాయల్ రాజ్ పుత్, శుభలేఖ సుధాకర్, ఎస్వి కృష్ణా రెడ్డి ఇలా లిస్టు పెద్దదే ఉంది మహా అయితే రెండు నిమిషాల కన్నా ఎవరూ ఎక్కువ లేరు.
సాంకేతిక వర్గం 
బయోపిక్ లు తీయడం కత్తి మీద సాములా అనిపిస్తాయి కాబట్టే ఇన్నాళ్లు ఎవరూ వాటి జోలికి వెళ్ళలేదు. నాగ అశ్విన్ ధైర్యంగా వేసిన ముందడుగు మహానటి రూపంలో ఎందరికో స్ఫూర్తినిచ్చింది. అయితే సావిత్రి గారి కథను డీల్ చేసినట్టుగా అందరికి వీలు పడదు. ఆవిడది కేవలం సినిమా ప్రపంచం మాత్రమే. మిగిలినవాళ్ళవి అలా కాదుగా. అందులోనూ ఎన్టీఆర్ అనే నట రాజకీయ గ్రంథం లాంటి వ్యక్తి కథను చూపాలనుకున్నప్పుడు కోట్లాది అభిమానుల అంచనాలు ఒత్తిడి రూపంలో దర్శకుడి మీద పని చేస్తాయి. అందుకే క్రిష్ చాలా జాగ్రత్తగా ప్రతి ఫ్రేమ్ ని శిల్పంలా మలిచే ప్రయత్నం చేసాడు. అయితే ఎలాంటి ప్రతికూలత అంశాలు లేకుండా సాఫీగా చూపించాలన్న ప్రయత్నంతో పాటు రెండు భాగాలుగా చూపాలన్న కాన్సెప్ట్ బాగా ల్యాగ్ అయ్యేలా చేసింది.
ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ సినిమా వేషాల కోసం కష్టపడటం, అవకాశాలు వచ్చాక ఎదురుకున్న సంఘటలను కృత్రిమంగా అనిపించడానికి కారణం ఇదే. పెద్ద కొడుకు చనిపోయినా షూటింగ్ చేయడం, మొదటి సారి కృష్ణుడి వేషంలో ఎన్టీఆర్ బయటికి వస్తున్నప్పుడు కొబ్బరి కాయలు కొట్టడం లాంటి రెండు మూడు సీన్లలో తప్ప ఎమోషన్ ఎక్కడా బలంగా రిజిస్టర్ కాలేదు. అప్పటి సినిమాల్లో సీన్స్ చూపించినప్పుడు ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వస్తాయి తప్ప మహానటి తరహాలో రెగ్యులర్ ఆడియన్స్ వాటిని అంత థ్రిల్ గా ఫీలవ్వరు.
ఎన్టీఆర్ ఇప్పటి తరానికి పెద్దగా అవగాహనా లేని ఒక గొప్ప చరిత్ర. అలాంటి వ్యక్తి కథను తెరకెక్కించాలి అనుకున్నప్పుడు చాలా హోమ్ వర్క్ చేసుండాలి. ఇందులో చూపించే సంఘటనలు ఏవీ తెలియనివి అనిపించవు. చాలాసార్లు పుస్తకాల్లో, వివిధ ఇంటర్వ్యూలలో చూసినవే. వాటినే కూర్చి కథగా రాసుకున్నారు. పైగా ఎన్టీఆర్ మహోన్నత త్యాగం చేసినట్టు పదే పదే చెప్పించే ప్రయత్నాలు గట్టిగా చేసారు. ఒక చోట కఠిన మౌన దీక్షలో ఉన్న ఓ యోగి ఎన్టీఆర్ ను చూడగానే కౌగిలించుకుని భోజనం పెట్టడం లాంటివి కేవలం ఉన్నంతంగా చూపించే ఉద్దేశంతో కనిపిస్తుందే తప్ప సహజత్వం మిస్ అయ్యింది. ఇలాంటివి బోలెడు ఉన్నాయి. ఎమర్జెన్సీ సమయంలో అన్నదమ్ముల అనుబంధం సినిమా బాక్సులు మదరాసులో ఇరుక్కుపోతే వాటిని బయటికి తీసుకొచ్చే సీన్ మాత్రం బాగా పేలింది.
కాకపోతే యమగోల సమయంలో పడుచు హీరోయిన్ల పక్కన ఎన్టీఆర్ డాన్సులు చేయటం గురించి కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు లాంటి సీన్స్ బాగా పండించారు.సౌలభ్యం కోసం దానవీర శూరకర్ణ టైంలో కృష్ణతో తలెత్తిన వివాదం లాంటివి కనీసం మాటవరసకు కూడా ప్రస్తావించకపోవడం తప్పే. ఎన్టీఆర్ ను వ్యక్తిత్వ పరంగా ఉన్నతంగా చూపించడంలో తప్పేమీ లేదు కాని వీక్ నెస్ లను కూడా సందర్భానుసారంగా టచ్ చేసి ఉంటే ఒరిజినాలిటీ పెరిగి దర్శకుడు హీరో మీద గౌరవం ఇంకా పెరిగేది. పదే పదే వచ్చే పాత పాటల బిట్ సాంగ్స్ ఒకదశలో అవసరమా అనిపించే ఫీలింగ్ కలిగిస్తాయి. అయినప్పటికీ క్రిష్ తన దర్శకత్వం వైపు ఎలాంటి లోపం లేకుండా చూసుకున్నాడు. ఇచ్చిన స్క్రిప్ట్ కు కట్టుబడి కోరుకున్న అవుట్ పుట్ అయితే ఇచ్చాడు కాని అసలు బలహీనత కథలోనే ఉంది కాబట్టి క్రిష్ తప్పేమీ లేదు
కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రాణం పోసారు. చాలా సన్నివేశాలు అద్భుతంగా ఎలివేట్ అయ్యాయి. పాటలు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఉన్నంతలో ఏదీ మైనస్ కాలేదు. జ్ఞాన శేఖర్ ఛాయాగ్రహణం ఇలాంటి సినిమాలకు ఎంత ఇవ్వాలో అంతకు మించే ఇచ్చింది. కాకపోతే బాలయ్యను చాలా సార్లు క్లోజ్ అప్ లోకి తీసుకోవడంతో కొన్ని సీన్స్ ఎబ్బెట్టుగా వచ్చాయి. అక్కడ జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు గొప్పగా అని చెప్పలేం కాని కొన్ని సన్నివేశాల్లో అద్భుతంగా పండాయి. అర్రం రామకృష్ణ ఎడిటింగ్ ఇంకొంత కోత వేసి ఉంటే బాగుండేది. బాలకృష్ణ-వారాహి-విబ్రి సహా నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. రాజీ పడకుండా ఖర్చు పెట్టారు
పాజిటివ్ పాయింట్స్ 
సెకండ్ హాఫ్ లో బాలయ్య
కీరవాణి సంగీతం
ఛాయాగ్రహణం
రిచ్ ప్రొడక్షన్
రెండు పాటలు
నెగటివ్ పాయింట్స్ 
కాస్త నెమ్మదిగా సాగే కథనం
ఎమోషన్స్ కొన్ని సీన్స్ కే పరిమితం
ఫస్ట్ హాఫ్ సాగతీత
కృత్రిమంగా అనిపించే కొన్ని పాత్రలు
అడ్డుగా వచ్చే బిట్ సాంగ్స్
చివరి మాట 
ఇది తెలుగు ప్రేక్షకులకు ఎన్టీఆర్ అనే మహోన్నత వ్యక్తి గురించి వెండితెరపై చూపించే ప్రయత్నమే అయినప్పటికీ ఫైనల్ గా నందమూరి అభిమానులకు మాత్రమే పూర్తిగా నచ్చే కథానాయకుడిగా మిగిలింది. కమర్షియల్ అంశాలకు ఇలాంటి కథల్లో చోటు ఉండదు కాబట్టి వాటిని ఆశించకుండా నటనలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన వ్యక్తి జీవితంగా కథానాయకుడుని వీక్షిస్తే ఓ మోస్తరుగా మెప్పిస్తాడు.  అలా కాకుండా అసాధారణ రీతిలో ఓ గొప్ప కళాఖండం చూస్తున్నామన్న ఫీలింగ్ తో చూస్తే మాత్రం నిరాశ తప్పదు. అభిమానులకు మాత్రమే నచ్చే ఈ వంటకాన్ని ఓ సారి టేస్ట్ చేయొచ్చు కాని ఈ కథానాయకుడు మాములు ప్రేక్షకుడి ఆకలిని పూర్తిగా తీర్చలేకపోవచ్చు.
రేటింగ్ : 3 /  5