Home రాజకీయాలు పవన్ ఆ పార్టీలకు అన్ని సీట్లిస్తే అంతే కథ!

పవన్ ఆ పార్టీలకు అన్ని సీట్లిస్తే అంతే కథ!

SHARE

తను కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుంటానని ప్రకటించాడు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. ఎవరితోనూ పొత్తు ఉండదని.. 175 సీట్లలో సొంతంగా పోటీ అని అంటూనే.. కమ్యూనిస్టు పార్టీలను కలుపుకుపోతానని పవన్ కల్యాణ్ ప్రకటించాడు. ఇలాంటి నేపథ్యంలో పవన్ కల్యాణ్ తో కమ్యూనిస్టు పార్టీల బేరం మొదలైనట్టుగా తెలుస్తోంది.

పవన్ ను ఎన్ని సీట్లు అడగాలనే అంశంపై కమ్యూనిస్టు పార్టీలు క్లారిటీతోనే ఉన్నాయని తెలుస్తోంది. ఏకంగా అరవై ఎమ్మెల్యే సీట్లలో పోటీకి తమకు అవకాశం ఇవ్వాలని కమ్యూనిస్టు పార్టీలు పవన్ వద్ద ప్రతిపాదిస్తున్నాయని సమాచారం. అంటే ఏపీలో ఉన్న మొత్తం సీట్లలో మూడో వంతు తమకు కేటాయించాలని కమ్యూనిస్టు పార్టీలు కోరుతున్నాయి.

అయితే కమ్యూనిస్టు పార్టీల స్థాయికి అరవై ఎమ్మెల్యే సీట్లు అంటే.. అది చాలా ఎక్కువ. దశాబ్దాల గమనాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాయి, టీడీపీతో పొత్తు పెట్టుకున్నాయి. అయితే.. అప్పుడు రెండు కమ్యూనిస్టు పార్టీలకూ కలిసి కనీసం ఇరవై సీట్లు కూడా దక్కలేదు. అది ఉమ్మడి రాష్ట్రం కథ.

కమ్యూనిస్టు పార్టీలకు కాస్తో కూస్తో బలం ఉన్నది తెలంగాణలోనే. ఆ తెలంగాణ విడిపోయింది. ఇక ఏపీలో ఎర్ర పార్టీల పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. అయినా.. అరవై సీట్లు డిమాండ్ చేస్తున్నాయట! అవి డిమాండ్ చేయడమే కామెడీగా ఉంది. ఒకవేళ పవన్ కమ్యూనిస్టు పార్టీలకు అన్ని సీట్లను కేటాయిస్తే.. ఎన్నికల ముందే చేతులు ఎత్తేయడమే అవుతుందని పరిశీలకులు అంటున్నారు.