Home రాజకీయాలు ప్రజల గుండె చప్పుడు విన్నా.. జగన్ ఉద్విగ్న ప్రసంగం!

ప్రజల గుండె చప్పుడు విన్నా.. జగన్ ఉద్విగ్న ప్రసంగం!

SHARE

ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ పాదయాత్రలో తను ప్రజల గుండె చప్పుడును విన్నానని అన్నాడు. ఆ ప్రజల గుండె చప్పుడే తన గుండె చప్పుడు అయ్యిందని జగన్ ప్రకటించాడు. పాదయాత్రతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రత్యక్షంగా గమనించే అవకాశం దొరికిందని జగన్ అన్నాడు.

ప్రజల కష్టాలన్నింటినీ తీర్చేలా తన పాలన ఉండబోతోందని.. తనకు అవకాశం ఇస్తే.. నవరత్నాలతో ప్రజల జీవితాన్ని ఆనందమయం చేస్తానని జగన్ వ్యాఖ్యానించాడు. ఇచ్చాపురంలో పాదయాత్ర ముగింపు సభలో జగన్ మాట్లాడుతూ.. తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద తీవ్రంగా విరుచుకుపడ్డాడు. చంద్రబాబు నాయుడు ప్రజాకంటక పాలన సాగిస్తున్నాడని ధ్వజమెత్తాడు. బాబును నారకాసురుడితో పోల్చాడు జగన్ మోహన్ రెడ్డి.

బాబు దుష్టపాలన ముగియడానికి మరెంతో సమయం లేదని.. మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయని..బాబు పాలనను అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని జగన్ అన్నారు.

పాదయాత్రలో భాగంగా తను కలిసిన ప్రజల గురించి, వారు తనకు చెప్పుకున్న కష్టాల గురించి జగన్ తన ప్రసంగంలో వివరించారు.

ఒకవైపు రైతులు కరువుతో కష్టాలు పడుతూ ఉంటే.. చంద్రబాబు నాయుడుకు రాజకీయాలు అవసరం అయ్యాయని.. రాజకీయాలు చేయడానికి అంటూ బాబు తమిళనాడుకు వెళ్తున్నాడని, కర్ణాటకకు వెళ్తున్నాడని.. ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సా చేస్తున్నాడని జగన్ విరుచుకుపడ్డాడు. బాబు తీరును ఈ విధంగా తీవ్రంగా దుయ్యబట్టాడు జగన్ మోహన్ రెడ్డి.