Home ప్రత్యేకం పాదయాత్ర ముగిసింది.. ఇక జగన్ జైత్రయాత్రేనా!

పాదయాత్ర ముగిసింది.. ఇక జగన్ జైత్రయాత్రేనా!

SHARE

సుదీర్ఘ కాలం పాటు సాగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ముగిసింది. అచ్చం వైఎస్ పాదయాత్ర వలె శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జగన్ పాదయాత్ర ముగిసింది. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నేత కూడా నడవనంత దూరాన్ని జగన్ నడిచాడు. రికార్డు స్థాయి దూరం పాదయాత్రను చేశాడు.

ఈ పాదయాత్రలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి లక్షలాది మంది ప్రజలను డైరెక్టుగా కలిశాడు. బహుశా ఏపీలో ఎక్కువమంది ప్రజలను కలిసిన వ్యక్తిగా కూడా జగన్ మోహన్ రెడ్డి నిలుస్తాడేమో. ఈ పాదయాత్రలో జగన్ ఎక్కడా అలుపునుసోలుపును చూపలేదు. అనునిత్యం వేల మంది వచ్చి మీదపడుతున్నా.. జగన్ వారందరినీ చిరునవ్వుతోనే పలకరిస్తూ వచ్చాడు. వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వచ్చాడు.

ఇలా సాగిన పాదయాత్ర ముగిసింది. ఇక వాట్ నెక్ట్స్ అనేది మిగిలింది. పాదయాత్రతో జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి గురించి కూడా పూర్తి స్పష్టత వచ్చింది. ఏ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది.. అక్కడి ఇన్ చార్జిల పరిస్థితి ఏమిటి, వాళ్లు ఎలా పని చేస్తున్నారనే అంశం మీద కూడా జగన్ పూర్తి స్పష్టత వచ్చింది.

ప్రజలకు చేరువ కావడం మాత్రమే కాదు.. తన పార్టీ పరిస్థితి గురించి కూడా జగన్ కు పూర్తి స్పష్టత వచ్చి ఉండవచ్చు. ఇన్ చార్జిలుగా ఉన్న వారిలో ఎవరికి టికెట్ ఇవ్వాలని, ఎవరు సరిగా పని చేయడం లేదనే అంశం మీద కూడా జగన్ ఒక అంచనాకు వచ్చి ఉండే అవకాశం ఉంది.

పాదయాత్ర ముగింపు సభలో భారీ ఎత్తున అభ్యర్థుల ప్రకటన చేయనున్నారని మొదట వార్తలు వచ్చాయి. అయితే జగన్ ఆ ప్రచారాన్ని ఖండించాడు. పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో.. ఇక అతి త్వరలోనే అభ్యర్థుల ప్రకటన మాత్రం ఖాయంగా ఉండే అవకాశం ఉంది. పాదయాత్ర ముగిసింది.. ఎన్నికలు రానే వస్తున్నాయి. ఇలాంటి నేఫథ్యంలో జగన్ జైత్ర యాత్ర ఎలా ఉండబోతోందో చూడాల్సి ఉంది!