Home రాజకీయాలు జగన్ సుదీర్ఘ యాత్ర.. ప్రయోజనాలేమిటంటే!

జగన్ సుదీర్ఘ యాత్ర.. ప్రయోజనాలేమిటంటే!

SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర ముగింపు దశకు వచ్చేసింది. బుధవారంతో జగన్ పాదయాత్ర ముగియబోతోంది. ఇడుపులపాయతో మొదలైన ఈ పాదయాత్ర ఇచ్ఛాపురంతో ముగుస్తోంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర కూడా ఇచ్ఛాపురంలోనే ముగిసింది.

జగన్ పాదయాత్ర కూడా ఇచ్ఛాపురంలోనే ముగుస్తోంది. మరి ఆ పాదయాత్రతో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు జగన్ అలా విజయం సాధిస్తారా? అనే ప్రశ్నకు మరో నాలుగు నెలల్లో సమాధానం దొరకనుంది.

ఇక ఈ సుదీర్ఘ పాదయాత్రతో జగన్ సాధించింది ఏమిటి? అంటే.. అది ప్రజలతో మమేకం కావడం. జగన్ లో ఒక నాయకుడిగా చాలా మెచ్యూరిటీని తీసుకు వచ్చి ఉంటుంది ఈ సుదీర్ఘ యాత్ర. అసలు ఇంత సుదీర్ఘ కాలం పాదయాత్ర చేయడమే జగన్ లోని నాయకత్వ లక్షణానికి ఒక నిదర్శనం.

జగన్ పాదయాత్ర మొదలై ఏడాది దాటి పోయి కూడా కొన్ని నెలలు గడిచాయి. శీతాకాలంలో జగన్ పాదయాత్ర ప్రారంభం అయ్యింది. వేసవి, వర్షాకాలాల్లో సాగింది. మళ్లీ శీతాకాలం కొనసాగుతున్న దశలో పాదయాత్ర ముగుస్తోంది. ఇన్ని వాతావరణ మార్పులను తట్టుకుంటూ.. మట్టి రోడ్ల మీద, మట్టి మనుషుల మధ్యన జగన్ పాదయాత్రను కొనసాగించాడు. తద్వారా ప్రజలందరి మనసులనూ గెలుచుకున్నాడు.

ఇకజగన్ పాదయాత్రకు ఉండిన రెస్పాన్స్ ఏమిటో కూడా వేరే వివరించనక్కర్లేదు. జిల్లాలకు, ప్రాంతాలకు అతీతంగా జగన్ పాదయాత్రకు బీభత్సమైన స్పందన వచ్చింది. ఈ యాత్రలో జగన్ సుమారు కోటి మంది ప్రజలను కలుసుకుని ఉంటాడని ఒక అంచనా. అంతకు మించి కూడా ఉండొచ్చు.

ఏదేమైనా..దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నేత చేయనంత సుదీర్ఘ పాదయాత్రను, సుదీర్ఘ కాలం పాటు, సుధీర్ఘ దూరం పాటు చేశాడు జగన్ మోహన్ రెడ్డి. ఈ విషయంలో నిస్సందేహంగా అభినందనీయుడే.