Home రాజకీయాలు జగన్ పై హత్యాయత్నం కేసు.. కొత్త మలుపు తిరిగినట్టే?

జగన్ పై హత్యాయత్నం కేసు.. కొత్త మలుపు తిరిగినట్టే?

SHARE

వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో విచారణను ఎన్ఐఏకు అప్పగించింది హై కోర్టు. ఈ అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్ కు అనుగుణంగా కోర్టుకు కూడా వెళ్లింది ఆ పార్టీ. అయితే ఈ విచారణకు ఏపీ ప్రభుత్వం ఒప్పుకోలేదు.

కౌంటర్లు దాఖలు చేయడానికి కూడా టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపించింది. అయితే ఈ విషయంలో తామే నిర్ణయం తీసుకుంటామని కూడా కోర్టు హెచ్చరించింది. చివరకు దీని విచారణ చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ విధంగా జగన్ పై జరిగిన హత్యాత్నం కేసు విచారణ ఎన్ఐఏ వద్దకు వెళ్లింది.

ఇది తెలుగుదేశం ప్రభుత్వానికి ఇబ్బందికరమైన అంశమే అని చెప్పాలి. ఎందుకంటే..ఇప్పటి వరకూ జగన్ పై జరిగిన హత్యాయత్నం విషయంలో టీడీపీ వాళ్లు రకరకాల మాటలు చెప్పారు. అది జగన్ మీద జగనే చేయించుకున్న దాడి అనడం దగ్గర నుంచి, జగన్ మీద ఆయన ఇంట్లో వాళ్లు దాడి చేయించారని చెప్పడంతో పాటు.. ఏదేదో మాట్లాడారు.

రకరకాల కథలు అల్లారు. చివరకు అది నిందితుడు సంచలనం కోసం చేసిన ఘటన అని తేల్చారు. అందులో కుట్రదారులు ఎవరూ లేరన్నట్టుగా ప్రకటన చేశారు.

ఆ ప్రకటన చేసిన వెంటనే ఇప్పుడు ఈ కేసు పై విచారణను హై కోర్టు కేంద్ర సంస్థకు అప్పగించడం విశేషం. ఈ విచారణ ఆసక్తిదాయకంగా మారింది. నిందితుడిని ఎన్ఐఏ అధికారులు తమదైన శైలిలో విచారిస్తే మొత్తం కథ బయటకు వచ్చేఅవకాశం ఉంది.