Home రాజకీయాలు కాంగ్రెస్, టీడీపీ.. సీట్ల విషయంలో చర్చలు మొదలు!

కాంగ్రెస్, టీడీపీ.. సీట్ల విషయంలో చర్చలు మొదలు!

SHARE

తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలకు జనాలు వాత పెట్టారు. దశాబ్దాల రాజకీయ వైరుధ్యాలు కలిగిన ఈ రెండు పార్టీలూ సిగ్గు ఎగ్గు వదిలి జనం ముందుకు వస్తే వాళ్లు చాచి కొట్టారు. ఐదేళ్ల కిందటి ఎన్నికల్లో ఈ పార్టీలు ఒక్కొక్కటిగా సాధించుకున్న ఓట్ల శాతాన్ని కూడా జంటగా సాధించుకోలేకపోయారు. ఇదీ ఈ రెండు పార్టీల పొత్తుకు దక్కిన బహుమతి, తెలంగాణ ప్రజలు అలా తిరస్కరించినా.. ఏపీలో ఈ రెండు పార్టీలూ పొత్తుకు సై అంటున్నాయి.

ఏపీలో పొత్తు ఒప్పందం తెలంగాణ ఎన్నికల సమయంలోనే కుదిరిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పార్టీలు ఇప్పుడు సీట్ల విషయంలో చర్చలు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించాడు.

తెలుగుదేశంతో పొత్తు విషయంలో రేపు కీలకమైన చర్చలు జరుగుతాయని ఆయన అన్నాడు. ఆ చర్చలు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరుగతాయని.. తను ఆ సమావేశానికి వెళ్తున్నట్టుగా రఘువీర ప్రకటించుకున్నాడు. తెలుగుదేశంతో తమ పార్టీకి పొత్తు ఉంటుందని ఇది వరకే కాంగ్రెస్ నేత కోట్ల ప్రకటించాడు. ఇప్పుడేమో రేపు కీలక చర్చలు అని రఘువీర ప్రకటించాడు.

తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల పొత్తులో ఇక తేలాల్సింది ఎవరికి ఏ సీటు అనేదేనని పరిశీలకులు అంటున్నారు. దాదాపు ఇరవై ఎమ్మెల్యే సీట్లను మూడు ఎంపీ సీట్లను కాంగ్రెస్ కు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సై అన్నాడని సమాచారం.